Thursday, January 23, 2025

వర్సిటీలలో నియామకాలకు కామన్ బోర్డు

- Advertisement -
- Advertisement -

osmania university

వర్సిటీలలో నియామకాలకు కామన్ బోర్డు
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అధ్యక్షతన వర్సిటీ సిబ్బంది నియామక బోర్డు ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలలో సిబ్బంది నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కామన్ బోర్డు ద్వారా జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో 16 జారీ చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వ్యవహరించనున్నారు. విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డు కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 15 యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాలను ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా చేపట్టనున్నారు. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి..? తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. వర్సిటీల్లోని 3,500 ఉద్యోగాల భర్తీకి కామన్ బోర్డు ప్రక్రియ ప్రారంభించనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
త్వరలో నిబంధనలు ఖరారు
రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, అంబేడ్కర్, మహాత్మగాందీ వర్సిటీలతో పాటు తెలుగు యూనివర్సిటీ,ఎఎన్‌ఎఫ్‌ఎయు, వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, అటవీ, ఆర్‌జియుకెటి విశ్వవిద్యాలయాల్లో కామన్ బోర్డు నియామకాలను చేపట్టనుంది. విశ్వవిద్యాలయాల్లో 3,500 బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా మిగతా వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టనున్నారు. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఒక్కో యూనివర్సిటీలో వేర్వేరుగా నియామకాలు చేపడితే.. కొన్నింటిలో ఖాళీలు ఏర్పాడుతున్నాయి. ఒకే అభ్యర్థి వివిధ యూనివర్సిటీలకు పోటీపడుతున్నారు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలినవి వదిలేస్తున్నారన్న అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. దానికి తోడు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను, బిహార్ తదితర రాష్ట్రాల్లో నియామకాలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించిన ప్రభుత్వం తెలంగాణలో కూడా నియామకాలకు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గురువారం కామన్ బోర్డును ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కావాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి బోర్డుకు కేటాయిస్తుంది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేయనున్నారు.

TS Govt issues notice over Common Board in Universities

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News