Saturday, November 16, 2024

పల్లె, పట్టణ ప్రగతి

- Advertisement -
- Advertisement -

అట్టహాసంగా మొదలైన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
జోరుగా సాగిన మొక్కలు నాటే కార్యక్రమం
పెద్దఎత్తున కొనసాగిన పారిశుద్ధ కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఉన్నతాధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. హరితహారం కింద పెద్దఎత్తున మొక్కలు నాటగా, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం కింద పారిశుద్ధ కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. ముందుగా గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభల్లో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. గత మూడు విడతల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో సాధించిన విజయాలను సభకు వివరించారు. కాగా నాలుగవ విడత కింద చేపట్టాల్సిన లక్ష్యాలను గ్రామ సభల ముందు ఉంచారు. పది రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ఆశించిన విధంగా పనులు పూర్తి చేస్తామని గ్రామసభల్లో ఏకగ్రీవంగా తీర్మానాలను చేశారు.
కాగా రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా నిర్వహించగా ఏడవ విడతను హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద అంబర్‌పేట్ కలాన్‌లో మొక్కలు నాటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఎ రూపొందించిన అర్బన్ ఫారెస్టును వారు ప్రజలకు అంకితం చేశారు. రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్ ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద నున్న పిల్లల పార్కులో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజమాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కేంద్రం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో ఆయన పెద్దఎత్తున మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితర మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్ధ కార్యక్రమాలను పరిశీలించారు. కాగా శంషాబాద్ మండలంలోని నానాజిపూర్ గ్రామంలో నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రారంభించారు.

TS Govt launching Haritha Haram program

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News