సచివాలయానికి కూత వేటు దూరంలోని రాజ్‌భవన్‌లో బిల్లులు మాసాల తరబడి పెండింగ్‌లో వున్నాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎంత కాలం ఓపిక పట్టగలుగుతుంది? అది ప్రజలెన్నుకున్న శాసన సభను అవమానించడమే కదా! అప్పుడెప్పుడో నువ్వలా చేశావు కాబట్టి ఇప్పుడు నిన్నిలా ఏడిపిస్తాననే పగ సాధింపు ధోరణికి గవర్నర్లే పాల్పడడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకొంటున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల విషయంలో నియమ విరుద్ధంగా వ్యవహరించే అవకాశాలుండవు. రాష్ట్రపతి తన అధికార ముద్రతో నియమించే గవర్నర్లను సగౌరవంగా చూసుకోడమే ధర్మంగా అవి నడుచుకొంటాయి. రాజ్‌భవన్లు మాత్రం తమను నియమించే రాష్ట్రపతికి కాకుండా తమను అందుకు ఎంపిక చేసిన కేంద్ర పాలకులకు ఏజెంట్లుగా, వారి రాజకీయ దుష్ప్రయోజనాలు నెరవేర్చేవారుగా పావులు కదపడం ఇటీవలి కాలంలో హద్దులు మీరిపోయింది. రాజ్‌భవన్‌లు రాజకీయ భవన్‌లు అయిపోతున్నాయి.
బడ్జెట్ సమావేశాలకు తెర లేపకుండా గవర్నర్ జాప్యం చేయదలచారని తెలుసుకొని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో ఆ రాష్ట్ర గవర్నర్ దిగి వచ్చి సకాలంలో సమావేశాలకు పచ్చ జెండా ఊపక తప్పలేదు. ఇది జరిగి వారం రోజులైనా గడవక ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో వున్న 10 కీలక బిల్లులను ఆమోదించవలసిందంటూ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు సూచించవలసిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో గురువారం నాడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 10 బిల్లుల్లో కొన్ని ఆరు మాసాలకు పైబడి రాజ్‌భవన్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని ఆమె అందులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు. రాజ్యాంగ హోదాలో, ఒక రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధినేతగా వుండే గవర్నర్లు సుప్రీంకోర్టు చేత చెప్పించుకోవలసిన పరిస్థితిని తెచ్చుకోడం వారికి గాని, రాజ్‌భవన్‌కు గాని ఎంత మాత్రం శోభస్కరం కాదు.
కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే అక్కడి గవర్నర్లకు తరచూ పేచీలు తలెత్తడం ప్రత్యేకించి గమనించవలసిన అంశం. ఇటువంటి వివాదాలు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అక్కడి గవర్నర్లకు ఎందుకు తలెత్తడం లేదు? తమ పదవులను కాపాడుకోడం కోసం కేంద్ర పాలకులకు దాసోహమనడం ఎంత వరకు సబబు? అందుకోసం గవర్నర్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలతో, వాటి ముఖ్యమంత్రులతో అర్థంపర్థం లేని కక్ష సాధింపుకి తెగించడం ఆ పదవికి చేసే హాని అంతఇంత కాదు. బిల్లులపై ఆమోద ముద్ర వేయకుండా ప్రభుత్వాలను ఇరుకునపెట్టే పాటవం చూపించడంలో తమిళనాడు, కేరళ గవర్నర్లు కూడా పోటీపడుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కీలకమైన పథకాలను కూడా అడ్డుకొంటున్నారు. తమిళనాడు గవర్నర్ 20 బిల్లులను పెండింగ్‌లో వుంచారని తెలుస్తున్నది. ఆన్‌లైన్ ఆటల క్రమబద్ధీకరణ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ అందుకు సంబంధించిన బిల్లును అడ్డుకోడంలోని ఔచిత్యం అర్థం కానిది.
గవర్నర్ తమిళ సై గతంలో ఒక సారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లులపై తమ అభిప్రాయం చెప్పడానికి నిర్దిష్టమైన వ్యవధి లేదంటూ వాటిని ఎంత కాలమైనా పెండింగ్‌లో వుంచే అధికారం తమకుందనే ధ్వనితో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆమోదానికి పంపించే వాటిలో జాతీయ ప్రాధాన్యమున్న బిల్లులేమైనా వుంటే గవర్నర్ వాటిని వెంటనే రాష్ట్రపతికి నివేదించవచ్చు. అందుకు భిన్నమైన ఇతర బిల్లులను వీలైనంత తొందరగా ఆమోదించడమో లేదా తిప్పి పంపడమో చేయడం విజ్ఞత అనిపించుకొంటుంది. ఒకవేళ తిప్పి పంపితే ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం మళ్ళీ గవర్నర్‌కు పంపించవచ్చు. అప్పుడు దానిని విధిగా ఆమోదించి తీరవలసిన బాధ్యత గవర్నర్‌పై వుంటుంది.
అందుచేతనే ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర అసౌకర్యం కలిగించడానికి తద్వారా కేంద్ర పాలకులను సంతృప్తి పరచడానికి గవర్నర్లు బిల్లులను నిరవధికంగా తమ వద్ద వుంచుకొంటున్నారు. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ 2018లో తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి అప్పటి గవర్నర్‌కు పంపించింది. ఆయన దానిపై ఎటువంటి చర్యా తీసుకోకుండా రెండేళ్ళకు పైగా తాత్సారం చేశారు. 2021 జనవరిలో సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తూ ఈ జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా తమ వద్ద వుంచుకొనే దుష్ట సంప్రదాయాన్ని అరికట్టాలంటే, ఆమోదం తెలపడానికి లేదా తిప్పి పంపడానికి నిర్ణీత వ్యవధిని పేర్కొంటూ రాజ్యాంగం 200 అధికరణను సవరించవలసి వుంటుంది. తెలంగాణ బిల్లుల విషయమై సుప్రీంకోర్టు తగిన పరిష్కారాన్ని చూపుతుందని ఎదురు చూద్దాం.