Wednesday, January 22, 2025

ప్రగతి ప్రదాత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలచిన రాజనీతి దురంధరుడు, తెలంగాణ రాష్ర్ట సమితి వ్యవస్థాపకులు, తన ఉపన్యాసంతో ప్రజల హృదయాలను ఉప్పొంగింపజేసిన ఉపన్యాసకులు, అసాధ్యమని భావించిన స్వరాష్ర్ట స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ రథసారథి, కేవలం పదేండ్లలోనే నూతన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ర్టంగా నిలిపిన దార్శనికులు, తెలంగాణ జాతిపిత, రాష్ర్ట విధాత, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్థానం స్వరాష్ర్టం ఏర్పాటైన తరువాత పదేండ్ల కాలంలో సాగిన సంక్షేమ పాలన అద్వితీయ ప్రస్థానమనే చెప్పాలి.

2023 జూన్ 02వ తేదీ నుండి 21 రోజుల పాటు దశాబ్ద కాలపు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ర్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు మనందరం సిద్ధపడుతున్నాం. అందుకు సిఎం కెసిఆర్ ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ ఘనకీర్తిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రెపరెపలాడేలా చేసిన ధీశాలి కెసిఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే సమైక్య రాష్ర్టంలో దారుణమైన వివక్ష, విద్రోహాలతో అణగారిపోయిన తెలంగాణ జాతిని మేల్కొలుపుతూ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భవించిన నాటి నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలలో టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం ప్రకంపనలు రేపింది.
తెలంగాణ ఉద్యమ రథసారథి కె.చంద్రశేఖర్ రావు తమ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయటంతో పాటు శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం ద్వారా నూతన విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పారు. తొలి అడుగులోనే కరీంనగర్‌లో సరిగ్గా ఇదే రోజు (మే 17,2001)న జరిపిన సింహగర్జన సభ విజయవంతమై తెలంగాణ రాష్ర్ట డిమాండ్‌కు ప్రజల్లో ఉన్న మద్దతును చాటి చెప్పింది.

ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ర్ట సమితి విశేషమైన ఫలితాలను సాధించడంతో పార్టీ రాజకీయంగా బలపడడానికి బాటలు పడ్డాయి. తన జీవితాశయం అయిన తెలంగాణ రాష్ర్ట సాధన కోసం తమ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి పూనుకున్న కెసిఆర్ సాహసం అనితర సాధ్యం. రాజకీయ నేతలు “తెలంగాణ” అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి సైతం ధైర్యం చేయని రోజులలో తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీని స్థాపించి, డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన ధీరత్వం కెసిఆర్ సొంతం. మాటలతో మంటలు రేపగల వారి ఉపన్యాసశక్తి తెలంగాణ ప్రజానీకం గుండెల్లో ఆత్మగౌరవ భావనను, పోరాట శీలాన్ని విస్ఫోటనం చెందేలా చేసింది. ఆబాల గోపాలం వారి వాక్పటిమకు ముగ్ధులయ్యారు.

సామాన్యుల నుండి మేధావుల వరకు అందరినీ ఆకట్టుకున్న ఉపన్యాస ధార కెసిఆర్‌ది. సాధనకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవటంలో కెసిఆర్ చూపిన పరిణతి రాబోయే తరాలకు విలువైన పాఠ్యాంశం. మరో మహాత్ముని వలె.. అహింసా పథంలో, చెక్కు చెదరని మనో విశ్వాసంతో, మొక్కవోని దీక్షతో పోరాటాన్ని వారు ముందుండి నడిపించారు. ఎన్నికలలో ఫలితాలు సాధించి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరిగేలా చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు డిమాండును జాతీయ స్థాయికి చేర్చారు. “నాకు కేంద్ర మంత్రి పదవి కన్నా రాష్ర్ట ఏర్పాటే మిన్న” అని చెప్పి, యుపిఎ నాయకత్వాన్ని అబ్బురపరిచారు. ఈ విషయాన్ని మాజీ రాష్ర్టపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ తమ రచనలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. కేంద్రమంత్రి హోదాలో దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు మద్దతును కూడగట్టారు. అంగీకార లేఖలను సాధించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవిని గడ్డిపోచకన్నా తేలికగా వదిలేయగలిగిన కెసిఆర్ త్యాగశీలత నిరుపమానమైనది.

తాము రాజీనామా చేయడమే కాకుండా కేంద్రంలో, రాష్ర్టంలో టిఆర్‌ఎస్ మంత్రివర్గ సభ్యుల చేత కూడా రాజీనామా చేయించారు. వారి మాటే శిరోధార్యంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం వారిని అనుసరించింది. అంతేకాకుండా పదవీ త్యాగం సరిపోదని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిరాహార దీక్షకు కెసిఆర్ సాహసించిప్పుడు యావత్ తెలంగాణ వారి క్షేమం కోసం తల్లడిల్లింది. వారికి సంఘీభావంగా పోరాడింది. పదకొండు రోజుల కెసిఆర్ దీక్ష పార్లమెంటును ప్రకంపింప చేసింది. కేంద్రం అనివార్యంగా దిగివచ్చేలా చేసింది. తెలంగాణ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి కెసిఆర్ చూపిన ఓర్పు, నేర్పు అనన్య సామాన్యం, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు సకల జనుల సమ్మె చేసినారంటే దాని వెనుక కెసిఆర్ ఇచ్చిన ధైర్యం కొండంత అండగా నిలవడం వల్లనే. బహుముఖాలుగా వారు చూపిన చతురత వల్ల రాజనీతిజ్ఞత వల్ల, నాయకత్వ పటిమ వల్ల తెలంగాణ రాష్ర్ట స్వప్నం సాకారమయింది.

ప్రజా విశ్వాసమే ఆయుధంగా ధరించి, ఏ రాజకీయ పార్టీ పొత్తు లేకుండా ఒంటిచేత్తో టిఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. కెసిఆర్‌కి తెలంగాణ అభివృద్ధి పునర్నిర్మాణంపట్ల ఉన్న లోతైన అవగాహన, ప్రజల హృదయాల్లో గొప్ప ముద్ర వేసింది. అందుకే తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు కెసిఆర్‌కే పట్టం కట్టారు. రెండో సారి కూడా ఆయనకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ముచ్చటగా మూడో సారి కూడా రాబోవు ఎన్నికల్లో కెసిఆర్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. 2014 నుండి నూతన రాష్ట్రానికి అన్నీ తానే అయిన కెసిఆర్ రాష్ర్టం ఏర్పడిన పదేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పది సంవత్సరాల వయసున్న రాష్ర్టం ఏడుపదుల వయసున్న రాష్ట్రాల కన్నా మిన్నగా అభివృద్ధిని సాధించడం వెనుక కెసిఆర్ దార్శనికత, అకుంఠిత దీక్షా దక్షతలే ప్రధాన కారణం. ఇందుకోసం కెసిఆర్ కొన్ని వందల గంటలు మేధో మథనం చేసి అనేక అద్భుతమైన పథకాలను ప్రణాళికలను తీర్చిదిద్దారు. తానొక మానవీయమూర్తి అయ్యి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సష్టించారు.

గతంలో పేరు మోసిన ముఖ్య మంత్రులు పరిష్కరించ లేకపోయినా కరెంటు సమస్యను అనతి కాలంలో పరిష్కరించి వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించారు. ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించి రాష్ర్ట ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచారు. పెంచిన సంపదను పేదలకు పంచారు. తెలంగాణ భూ భౌతిక పరిస్థితులను ఔపోసన పట్టి మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించారు. తరతరాల తాగునీటి కష్టాలకు చరమ గీతం పాడారు. తానే సాగు నీటిరంగ నిపుణులుగా మారి, నిరంతరం అధ్యయనం చేసి ప్రాజెక్టులు రీడిజైన్ చేశారు. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు కెసిఆర్. నడి ఎండా కాలంలో సైతం తెలంగాణ చెరువులు మత్తడి దుంకే అద్భుత దృశ్యాలను ఆవిష్కరించారు. కెసిఆర్ పరిపాలనా సంస్కరణలతో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారు. పల్లె ప్రగతితో ఆదర్శ గ్రామాలను సృష్టించారు.

ఎక్కడున్న తెలంగాణ.. ఎక్కడికి చేరిందని ప్రతిఒక్కరూ అబ్బురపడే విధంగా అమోఘమైన అభివృద్ధిని సాధించి అద్భుత తెలంగాణను సాక్షాత్కరింప చేశారు. ఇరవై ఏండ్లుగా అప్రతిహత విజయాలతో ముందుకు నడిపిస్తూ టిఆర్‌ఎస్ పార్టీని అజేయశక్తిగా నిలబెట్టారు. తెలంగాణ రాష్ర్ట సమితి విజయ ప్రస్థానానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ప్రతీ కార్యకర్త గర్వంతో ఉప్పొంగిపోయే ఘన కీర్తిని మనందరికీ ఆపాదించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింతగా శిఖరాయమానమైన ప్రగతిని సాధించాలని, ప్రజల కలలు పండే బంగారు తెలంగాణ ఆవిషృ్కతం కావాలని కోరుకుంటున్నారు. అహింసాయుతంగా, శాంతియుత పంథాలో ఉద్యమించిన తెలంగాణ రాష్ర్ట సమితి ఇటీవల బిఆర్‌ఎస్‌గా అవతరించి యావత్ దేశానికి దిక్సూచీలా పథకాలను అమలు చేస్తూ తన విజయ ప్రస్థానాన్ని యావత్ భారత దేశానికి సరికొత్తగా పరిచయం చేస్తోంది.

వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News