Monday, December 23, 2024

రైతుబంధుకు రక్షణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారిని పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తూ కేసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పధకానికి మరింత రక్షణ కల్పించారు. బ్యాంకుల్లో ఇదివరకే పంటల సాగు కోసం క్రాప్‌లోన్స్‌గా రైతులు తీసుకున్న రుణాలకు రైతుబంధు నిధులు జమవేయకుండా ప్రభుత్వం అడ్డుచక్రం వేసింది. రైతుల ఖాతాల్లో ఉన్న రైతుబంధులు ఏవిధమైన పాత బకాయిలకు చెల్లు వేసుకోకుండా బ్యాంకర్లను కట్టడి చేస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రకృతి వైపరిత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం దేశ ప్రజల ఆహార భద్రతకోసం శ్రమిస్తున్న రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్ఫధంతో వ్యవహరించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు బ్యాంకర్ల సమితీకి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసిన డబ్బును బ్యాంకుల్లో పాత బకాయిల కింద జమ చేసుకోవడానికి సంబంధించి విచారణ చేపట్టి వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్టేట్‌లెవల్ బ్యాంకర్స్ కమిటి సెక్రటరిని ఆదేశించారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని బ్యాంకులకు ఎస్‌ఎల్‌బిసి గైడ్‌లైన్స్ ప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రైతుబంధు నిధులు పాత బకాయిల కింద జమ చేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇటు వంటి సంఘటనలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్‌ఎల్‌బిసి సెక్రటరిని కోరారు. మరో వైపు వ్యవసాయశాఖకూడా రైతుబంధు నిధులు పట్ల అప్రమత్తమైంది. రైతుల ఖాతాల్లోని నిధులు పాత బకాయిలకు జమ చేసుకున్న బ్యాంకర్లపై వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు సూచించారు. రైతుబంధు నిధులు తిరిగి ఇప్పించే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగించారు. రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించి బ్యాంకర్లతో మాట్లాడి రైతుబంధు నిధులు తిరిగి రైతుల ఖాతాల్లోనే జమ చేయించాలని ఆదేశించారు.

తీరు మార్చుకోని బ్యాంకర్లు ప్రతియేటా ఇదే తంతు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు జమ చేయటం , ఆ నిధులను బ్యాంకర్లు ఆ రైతు క్రాప్‌లోన్ బకాయిలకు సర్దుబాటు చేసుకోవటం ప్రతియేటా ఒక తంతుగా మారింది. ప్రభుత్వం ప్రతియేటా హెచ్చిరిస్తున్నా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు క్రాప్‌లోనే కింద తీసుకున్న రుణాలు తిరిగి ఆ రైతులనుంచి వసూలు చేసుకోవటంలో ఎవరికీ ఎటువంటి అభ్యతరం ఉండదు. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబుధు నిధులు రైతుచేతికి అందకపోతే విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలకు చేతిలో డబ్బులేక రైతులు ప్రైవేటు వడ్డివ్యాపారుల పాలిట బడి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు.

వ్యవసాయరంగం అభివృద్ధి పట్ల కేసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకుంది. రైతుబంధు , రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పధకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగంలో 10శాతం వృద్ధి నమోదయినట్టు నీతి ఆయోగ్ కూడా ఇటీవల ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ఇచ్చన మాట ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో 36వేలకోట్ల రుణమాఫీ ప్రకటించింది. దశల వారీగా ఇప్పటికే రైతుల రుణమాఫీ కింద రూ.17351కోట్లకు పైగా చెల్లించింది. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అమలు కోసం ఏటా రూ.10500కోట్లు ఖర్చు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే ఆ కుంటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 95107రైతుకుటుంబాలకు రూ.4755కోట్లు సాయం అందిచింది.

70లక్షల మందికి రైతుబంధు సాయం 

రాష్ట్రంలో 70లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. యాసంగిలో ఈ పథకం కింద ఇప్పటికే ఎకరాకు రూ.5000చొప్పున పెట్టుబడి సాయంగా 5,93,717ఎకరాలకు సాయం అందించింది. ఈ నెల 28నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తూవస్తోంది. ఇప్పటివరకూ 4 ఎకరాలు ఉన్న రైతులందరికి నిధులు అందజేసింది. ఇప్పటికే 54.70లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.4,377.99కోట్లు జమ చేసింది. ఈ నిధులు రైతులందరికీ పెట్టుబడి సాయంగా అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. పాత బకాయిలకు జమ చేసుకునే వీలు లేకుండా బ్యాంకర్లను కట్టడి చేస్తూ రైతుబంధు నిధులకు తగిన రక్షణ కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News