Tuesday, November 19, 2024

పది విద్యార్థులందరూ పాస్

- Advertisement -
- Advertisement -

పది విద్యార్థులందరూ పాస్
ఎఫ్‌ఎ మార్కుల ఆధారంగా గ్రేడ్ల కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

TS Govt Promote all SSC Students without exams

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మెటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ కారణంగా పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,393 మంది విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనున్నారు. గత విద్యాసంవత్సరం కూడా ఎఫ్‌ఎ మార్కుల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. జూన్ రెండవ వారం కొవిడ్ పరిస్థితిని సమీక్షించి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, బ్యాక్‌లాగ్ ఉన్న రెండవ సంవత్సరం విద్యార్థులను కనీస మార్కులు వేసి పాస్ చేయనున్నట్లు తెలిపింది.
గ్రేడ్లు ఎలా ఇస్తారంటే..?
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకేసారి ఫార్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనున్నారు. ఎఫ్‌ఎ 1కు గరిష్టంగా 20 మార్కులు ఉంటాయి, అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కిస్తారు. ఉదాహరణకు 20 మార్కులకు 18 వస్తే 100 మార్కులకు 90 వచ్చినట్లు పరిగణించి ఆ మేరకు గ్రేడ్లు ఇస్తారు. హిందీ మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులో 91 నుంచి 100 గ్రేడ్ పాయింట్ యావరేజ్(జిపిఎ) సాధించినట్లు పరిగణిస్తారు. హిందీలో మాత్రం 90 వచ్చినా ఎ1గా ఇస్తారు. అప్పుడు 10కి 10 జిపిఎ సాధించినట్లుగా పరిగణిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున మొత్తం 60 పాయింట్లకు ఎన్ని వచ్చాయో లెక్కించి గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు.

TS Govt Promote all SSC Students

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News