Friday, November 15, 2024

ఐసోలేషన్ సెంటర్లుగా రైల్వే బోగీలు!

- Advertisement -
- Advertisement -

ఐసోలేషన్ సెంటర్లుగా రైల్వే బోగీలు..!
100 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న అధికారులు
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ కీలక నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను కూడా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కోచ్‌లో 25 మందికి చికిత్సను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్‌తో పాటు ప్రత్యేక మెడికల్ టీం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు మెడికల్ కిట్, డైట్‌ను కూడా అందించనున్నారు. అంతేగాక ఈ సెంటర్లలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. వైద్యశాఖ, రైల్వే శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు సమన్వయమై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి రోజు ఈ కోచ్‌లలో చికిత్స పొందే రోగులను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని వైద్యశాఖ చెబుతోంది.
బెడ్ల కొరత తగ్గించేందుకు ఈ నిర్ణయం…
సెకండ్ వేవ్ కరోనాలో సుమారు 90 శాతం మంది అసింప్టమాటిక్‌తో వైరస్ బారిన పడుతున్నారు. దీంతో తెలియకుండానే వైరస్ వ్యాప్తి పెరిగింది. ఈక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బెడ్లు నిండిపోతున్నాయి. దీంతో అసింప్టమాటిక్, మైల్డ్ లక్షణాలున్నోళ్లను కేవలం ఐసోలేషన్ సెంటర్లలోనే ఉంచాలని ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 47 కొవిడ్ కేర్ సెంటర్లు ఉండగా, రాబోయే రోజుల పరిస్థితుల దృష్టా మందస్తు జాగ్రత్తతో రైల్వేబోగీలనూ ఐసోలేషన్ సెంటర్లుగా మార్చుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆధీనంలో కొవిడ్ చికిత్సను అందిస్తున్న 116 హాస్పిటల్స్‌లో సాధారణ, ఆక్సిజన్ వెంటిలేటర్ కలిపి 13,732 బెడ్లు ఉండగా కేవలం 3703 నిండాయని, మరో 10,029 పడకలు ఖాళీగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా 871 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 30,816 బెడ్లు ఉండగా 10,919 నిండగా మరో 19,897 పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ రోజు రోజుకి తీవ్రత మరింత పెరుగుతుండటంతో వైద్యశాఖ ఈ నిర్ణయం తీసుకుందని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

TS Govt ready Rail Coaches for isolation centers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News