Thursday, January 23, 2025

గృహలక్ష్మిమార్గదర్శకాలు జారీ

- Advertisement -
- Advertisement -

గృహలక్ష్మి పథకం పేదలకు వరం
పేదల సొంతింటి కల నెరవేర్చడమే సిఎం కెసిఆర్ ఆశయం
సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 3లక్షల ఆర్ధిక సాయం
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు
4 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ది
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
సిఎం కెసిఆర్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు
మన తెలంగాణ/హైదరాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలకు సంబంధించిన జిఓను ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గృహ లక్ష్మి పథకం కెసిఆర్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరం లాంటిదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ 3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రికి పేదల పక్షాన మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గృహలక్ష్మి పథకం గైడ్‌లైన్స్…
రూ.3 లక్షలు కావాలంటే ఇవి పాటించాల్సిందే
సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షల నగదు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. గృహలక్ష్మి పథకంలో భాగంగా కట్టుకొనే ఇల్లు మహిళ పేరు మీదనే ఉండాలి. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ తో ఇల్లు కట్టుకోవచ్చు. ఈ పథకం పొందిన ఇంటిపై గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాలి. గృహలక్ష్మి పొందాలంటే సంబంధిత కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలి. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసిలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు చేస్తారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపారు.

మహిళ పేరుపైనే బ్యాంకు ఖాతా
పథకం కింద లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఒకేసారి కాకుండా 3 దఫాలుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇలా మూడు దశల్లో సాయం జమ చేస్తారు. ఇందుకోసం లబ్దిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌సిలకు 20 శాతం, ఎస్‌టిలకు 10 శాతం, బిసి, మైనారిటీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని జీఓలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల చొప్పున, మొత్తం 4 లక్షల కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం సిఎం కెసిఆర్ ఆశయం అని, గృహలక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరం అని చెప్పారు.
మార్చి 9న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకొని అప్పుడే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4 లక్షల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించింది. పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News