గ్రామపంచాయతీలకు రూ.182.49కోట్లు
మండల పరిషత్‌లకు రూ.124.11 కోటు
జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు
విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసింది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు మొత్తంగా రూ.432 కోట్ల 49 లక్షలను విడుదలయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సిఎంకు ధన్యవాదాలు
కరోనాసమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాకూడ ప్రతినెలా గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కు మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ స్ధానిక సంస్థలకు ఆర్థికఇబ్బందులు లేకుండా ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రతినెలా గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.227.50కోట్లను విడుదలచేస్తున్నామన్నారు. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.210.44కోట్లుకాగా, మండల పరిషత్లకురూ.11.41కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.5.65కోట్లు విడుదల చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గ్రామపంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సదుద్ధేశంతో ప్రణాళిక బధ్ధంగా గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతల సమగ్ర అభివృద్ధియే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. మౌలిక సదుపాయల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతలకు ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం అమలు వల్ల రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకుర్చామని ఆయన తెలిపారు. దీనికి తోడుగా ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల వల్ల పల్లెల సమగ్ర స్వరూపమే మారిందని మంత్రి అన్నారు.