తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్‌లో బోనాలు
ఉత్సవాల ఏర్పాట్లుకు రూ.15 కోట్లు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో జరిగే ఉత్సవాలు, పండుగలు, వేడుకలు విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎనిమిది సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో దేశ, విదేశీ యాత్రికులకు సందడి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల ఉత్సవాలు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గోల్కొండ కోట వద్ద గురువారం ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇటీవలే బోనాలు ఉత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారులకు దిశా నిర్దేశనం చేశారు. లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
జులై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నారు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మఫ్టీ పోలీసులు, షీ టీమ్‌లను నియమించారు. వాహనాల పార్కింగ్ కోసం ఎనిమిది ప్రాంతాలను గుర్తించారు. 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకెట్స్, 55 వేల వాటర్ బాటిల్స్‌ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 4 అంబులెన్స్‌లు, 5 మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు, ఆత్మ గౌరవం ప్రపంచానికి తెలియాలని సంకల్పంతో బోనాలు, ఇతర వేడుకలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
TS Govt releases Rs 15 Cr for Bonalu