Monday, December 23, 2024

84 గ్రామాల్లో ఇక రియల్ బూమ్

- Advertisement -
- Advertisement -

 జీఓ 111 ఎత్తివేతతో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై అధికారుల కసరత్తు
 సుమారు 8 నెలల సమయం పట్టే అవకాశం
 భారీగా పెరగనున్న భూముల ధరలు
 ఆయా గ్రామాల ప్రజల హర్షం

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీఓ 111ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. జీఓ 111 కింద ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాలు వస్తుండగా ప్రస్తుతం ఇదంతా బయోకన్జర్వేషన్ జోన్‌గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు జీహెచ్‌ఎంసి విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల భూములుండగా, ఇక్కడ వ్యవసాయేతర కార్యకలపాలపై నిషేధం ఉండడంతో ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధికి అడ్డుకట్టపడింది.

ఆయా గ్రామాల ప్రజలు మహానగరానికి దగ్గర ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని కొన్ని సంవత్సరాలుగా అన్నీ ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. చివరకు సిఎం కెసిఆర్ ఆ 84 గ్రామాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం ఓ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జిఓ 69లో జిఓ111కు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈనేపథ్యంలోనే మార్గదర్శకాలను విడుదల చేసిన సంవత్సరం తరువాత జీఓ 111 పూర్తిగా ఎత్తివేస్తూ గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరగనున్నాయి.

మరో సుందరమైన సిటీగా 84 గ్రామాలు
అయితే జిఓ 111 పరిధికి సంబంధించి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సుమారుగా 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని, అందులో ఏ ప్రాంతం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తేలిన తరువాత భూములను కొనుగోలు చేస్తే మంచిదని రియల్టర్‌లు సూచించడం విశేషం. ఈ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో అధికారులు అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిహెచ్‌ఎంసి విస్తీర్ణం ఉన్న ఈ 84 గ్రామాల పరిధిని మరో సుందరమైన సిటీగా రూపొందించేలా, 40 నుంచి 50 ఏళ్ల పాటు మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్టుగా తెలిసింది.

నగరానికి కృష్ణా, గోదావరి జలాలు
హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. చాలా ఏళ్ల వరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా, ఈ జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కారు జీఓ 111 తీసుకొచ్చింది. ఈ జీఓ కారణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్‌పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 111 జిఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అసలు జీఓ 111 అంటే ఏమిటీ?
నగర శివారులోని గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు జీఓ 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీఓ 192ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీఓ 111ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జీఓలో క్యాచ్‌మెంట్ పరిధిలో వేసే లే ఔట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. ఇందుకు హుడా బాధ్యత వహించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదని ఆ జిఓలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది.

2016లో హైపర్ కమిటీ నియామకం
ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురానూ కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై స్థానికులు ఆధారపడటం లేదు. దీనివల్ల జీఓ 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. ఈ జీఓపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జీఓ ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీఓపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై 2021 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
జిఓ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు
జిఓ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు ఇలా ఉన్నాయి. మొయినాబాద్ మండలంలో 20 గ్రామాలు, శంషాబాద్ మండలంలో 47 గ్రామాలు, షాబాద్ మండలంలో 02 గ్రామాలు, కొత్తూరు మండలంలో 01 గ్రామం, రాజేంద్రనగర్ మండలంలో 03 గ్రామాలు, శంకర్‌పల్లి మండలంలో 03 గ్రామాలు, చేవెళ్ల మండలంలో 06 గ్రామాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News