Friday, December 20, 2024

9,168 కొలువులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్- 4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్- 4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆశావహులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గ్రూప్-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. 9,168 ఖాళీలలో.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859,జూనియర్ అకౌంటెంట్ 429 ఖాళీలు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు ప్రభుత్వం గ్రూప్ -2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టులు భారీగా పెరిగాయి.

* గిరిజన సంక్షేమ శాఖలో 42 పోస్టులకు ..

– గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో -హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులను భర్తీ చేయనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 42 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ పరిధిలోని శాఖలు, సంస్థలలో వివిధ కేటగిరీలలోని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీ పోస్టులకు, స్థానిక కేడర్ వారీగా, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.

* త్వరలోనే గ్రూప్ 2,3 ఉద్యోగ నియామకాలు..

త్వరలోనే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల నోటికేషన్ల విడుదలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్దమవుతోంది. కొత్త పోస్టులను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గ్రూప్- 2లో 663 పోస్టులు, గ్రూప్- 3లో 1373 పోస్టులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ శాఖల్లో సహాయ అధికారుల పోస్టులకు కూడా గ్రూప్ 2 కిందే నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారులు, జువైనల్ సర్వీస్ విభాగంలో ప్రొబేషనరీ అధికారి పోస్టులను కూడా గ్రూప్ 2 కిందే భర్తీ చేయనున్నారు. దీంతో గ్రూప్ 2లో వందకు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల ప్రతిపాదనలు, రోస్టర్ వివరాలు కూడా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చేరాయి.

* గ్రూప్ 4 ఖాళీల వారీగా జాబితా..

I. జూనియర్ అకౌంటెంట్ 429 ఖాళీలు

* ఆర్థిక శాఖలో 191
* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం 238

II. జూనియర్ అసిస్టెంట్ 6,859

* వ్యవసాయం మరియు సహకార శాఖ 44
* పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య విభాగం 2
* వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 307
* వినియోగదారుల వ్యవహారాల ఆహారం & పౌర సరఫరాల శాఖ 72
* ఇంధన శాఖ 2
* పర్యావరణం, అడవులు, సైన్స్, టెక్నాలజీ విభాగం 23
* ఆర్థిక శాఖ 46
* సాధారణ పరిపాలన విభాగం 5
* ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ 3 38
* ఉన్నత విద్యా శాఖ 742
* హోం శాఖ 133
* పరిశ్రమలు, వాణిజ్య శాఖ 7
*‘నీటిపారుదల విభాగం 51
* కార్మిక, ఉపాధి, శిక్షణ విభాగం 128
*మైనారిటీ సంక్షేమ శాఖ 191
*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం 601
*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 1,245
*ప్రణాళిక విభాగం 2
*రెవెన్యూ శాఖ 2,077
*షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ 474
*మాధ్యమిక విద్యా విభాగం 97
*రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ 20
*గిరిజన సంక్షేమ శాఖ 221
* మహిళా శిశు సంక్షేమ శాఖ 18
* యువజన, సాంస్కృతిక పర్యాటక శాఖలో 13

III జూనియర్ ఆడిటర్ పోస్టులు 18

IV. మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862,

మొత్తం పోస్టులు.                           9168

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News