Friday, November 15, 2024

హెల్త్ సిటీగా వరంగల్

- Advertisement -
- Advertisement -

నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న సిఎం కెసిఆర్ కల
వైద్య, దంత కళాశాలలు కూడా

మనతెలంగాణ/హైదరాబాద్: ఓరుగల్లు హెల్త్‌సిటీగా రూపుదిద్దుకోనుంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్‌లో ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన ఈ హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం మొత్తం 215.35 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. అందులో 15 ఎకరాల్లో రూ.1,100 కోట్లతో నిర్మాణాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జిఒ ఎం.ఎస్ నెంబర్.158 ను ఉత్తర్వులు జారీ చేసింది. 24 ఫ్లోర్లతో బారీ భనవ సముదాయంతో మొత్తం 2 వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నది. అందులో స్పెషాలిటీ వైద్యం కోసం 1,200 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇఎన్‌టి, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ తదితర స్పెషాలిలీ వైద్యసేవలు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీల కోసం 800 పడకలు ఉంటాయి. వీటిలో ఆంకాలజి సహా..న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలు ఉండనున్నాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా డెంటల్ కళాశాలను ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు. హెల్త్ సిటీలో వైద్య విద్య కొరకు ప్రత్యేక ఆరోగ్య విశ్వ విద్యాలయం ( కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం) ఏర్పాటు చేయనున్నారు. వైద్య సేవల కొరకు 2 వేల పడకల మల్టీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీనిలో సాధారణ సేవలైన మెడిసిన్, సర్జరీలతో పాటు సూపర్ స్పెషలిటీ సేవలైన గుండె, కిడ్నీ, కాన్సర్ సేవలు అందించనున్నారు. అలాగే వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కొరకు వసతి ఏర్పాటు చేయనున్నారు. రోగులకు, వారి సహాయకులకు ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయనున్నారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కల సాకారం కానుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నహాలు చేస్తోంది.ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఎంజీఎం ప్రభుత్వాసుపత్రి పేదలకు వైద్యం మెరుగైన వైద్యం అందిస్తోంది. పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ఇప్పటికే వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో వరంగల్ జిల్లాను హెల్త్ సిటీగా రూపుదిద్దాలన్న సిఎం కెసిఆర్ ఆకాంక్ష మేరకు, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జిఒ ఎం.ఎస్ నెంబర్.158 ను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.ఇందులో సివిల్ పనులకు రూ. 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ. 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ. 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టిఎస్‌ఎంఎస్‌ఐడిసి, డిఎంఇ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సిఎం కెసిఆర్ నాయకత్వంలో వరంగల్‌లో స్పెషాలిటీ హాస్పిటల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో, వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. పూర్తి సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వైద్య విభాగాలు, మెడికల్, డెంటల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1100 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో సిఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేయడమే గాక, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిఎం కెసిఆర్‌కు, వరంగల్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడం వల్ల పనులు మరింత వేగంగా జరుగుతాయని ఆశిస్తూ, మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే, హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం, వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌పై భారం తగ్గుతుందని చెప్పారు. సిఎం కెసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కెసిఆర్‌ది అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

TS Govt to convert Warangal as Health City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News