Monday, December 23, 2024

నేటి నుంచి పెన్షన్ల జాతర

- Advertisement -
- Advertisement -

 3.3లక్షల దరఖాస్తుదారులకు తొలి ప్రాధాన్యం
 మిగిలిన వారికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
 మొత్తం 46లక్షలకు చేరుకోనున్న పెన్షన్‌దారుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రంలో పెన్షన్ల జాతర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పది లక్షల మందికి ఫించన్లు అందచేయాలని నిర్ణయించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం వయస్సును కుదించిన తరువాత గత సంవత్సరంలోనే సుమారు ఎనిమిది లక్షల మంది వరకు మీ సేవ కేంద్రాల్లో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల మంజూరుపై ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పెన్షన్ల సంఖ్య 46 లక్షలకు చేరుకోనుంది. అయితే కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా తొలుత మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యం లభించనుంది. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 3.3 లక్షల మందికి వెంటనే పింఛను మంజూరుకు రంగం సిద్ధం చేశారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 3.3 లక్షల మంది దరఖాస్తుల పరిశీలన గతంలోనే పూర్తయింది. ఇందులో వితంతువుల దరఖాస్తులు దాదాపు 1.68 లక్షలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులవి 68 వేలు, దివ్యాంగుల దరఖాస్తులు 57 వేల వరకు ఉన్నారని తెలుస్తోంది. వీరందరికి మొదట విడతగా పెన్షన్లు ఇస్తారు. తదనంతరం మిగిలిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేశారు. కాగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో మొత్తంగా రూ. 11,728 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38.41 లక్షల మందికి పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.775 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కొత్తగా వచ్చే లబ్దిదారులను కలుపుకుంటో మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నెలకు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 977 కోట్లకు పైగా వెచ్చించనుందని తెలుస్తోంది.

TS Govt to Decide 3.3 lakh new Aasara Pensions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News