70% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలి
ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తాం
పన్ను మినహాయింపుల వంటివి కల్పిస్తాం
ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది
హుజూర్‌నగర్ నియోజకవర్గం సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాల సమావేశంలో మంత్రి కెటిఆర్
సిసిఐని పునరుద్ధరించాలి
సింగరేణి నుంచి బొగ్గు సరఫరాకు సిద్ధంగా ఉన్నాం – కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండేకు కెటిఆర్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: హుజుర్‌నగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని సిమెంట్ కంపెనీల యజమాన్యాలతో గురువారం హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో 70శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించే కంపెనీల కు నూతన పారిశ్రామిక పాలసీ కింద పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహకాలు ఇస్తామన్నారు. అలాగే పన్ను మినహాయింపులు వంటి వాటికి ప్ర భు త్వం నుండి సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. అలాగే సిమెంట్ పరిశ్రమల అవసరాల కోసం దృష్టి సా రిం చి స్థానిక యువతకు సాంకేతిక రంగంలో రాణించడానికి ఒక ‘ నైపుణ్య శిక్ష ణ కేంద్రాన్ని‘ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్‌ఐఐసి ఎండి ఇవి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు ఆయన ఒక లేఖ రాశారు.ఆదిలాబాదులో మూతపడిన సిసిఐని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ కోరారు. ఈ విషయాన్ని గతంలో కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని మంత్రి కెంటిఆర్ తన లేఖలో ప్రస్తావించారు. 1984లో ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ. 47 కోట్ల వ్యయంతో సిసిఐను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిసిఐకి 772 ఎకరాల్లో ప్లాంట్ ఉన్నదన్నారు. దీంతో పాటు 170 ఎకరాల్లో సిసిఐ టౌన్‌షిప్ కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవని కెటిఆర్ పేర్కొన్నారు.
కానీ దురదృష్టవశాత్తు 1996లో నిధుల లేమితో కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా ఆగాయన్నారు. 2008లో సిసిఐ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పూర్తిగా మూసి వేయడం జరిగిందని అన్నారు. అయితే ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లారని, అప్పటి నుంచి ఈ అంశంపైన స్టేటస్ కో ఉందన్నారు. ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని తెలిపారు. అలాగే సిసిఐకు ప్రత్యేకంగా 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉన్నదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ 32 కెవిఎ విద్యుత్ సరఫరా కనెక్షన్, అవసరమైన నీటి లభ్యత ప్లాంట్ కి ఇప్పటికీ ఉన్నదని కెటిఆర్ తన లేఖలో తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అవసరమైన బొగ్గు సరఫరాను స్థానిక సింగరేణి కార్పొరేషన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. ఇలా సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణకు అనేక సానుకూల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ దిశగా తగిన చర్యలను వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కెటిఆర్ కోరారు.