Sunday, November 24, 2024

వేలం నేడే

- Advertisement -
- Advertisement -

రూ. కోటాను కోట్ల కోకాపేట భూముల

వేలం ఆపాలంటూ వ్యాజ్యం వేసిన విజయశాంతికి చుక్కెదురు
జిఒ 13 రద్దుకు హైకోర్టు నిరాకరణ

కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92ఎకరాల భూమి వేలానికి రంగం సిద్ధం
పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్న 100 సంస్థలు 
గతంలో వేలం వేసినప్పుడు కోకాపేట పరిసరాల్లో ఎకరాకు పలికిన ధర రూ.40కోట్లు
కోకాపేట భూములను అత్యాధునిక సౌకర్యాల వెంచర్‌గా మార్చిన హెచ్‌ఎండిఎ 8 ప్లాంట్లు
విభజించి ఎకరాకు ధర రూ.25కోట్లగా నిర్ధారించిన ప్రభుత్వం
వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల రాబడి అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టబోతున్నాయి. 49.92ఎకరాలను ఈనెల 15వ తేదీన ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) వేలం వేయబోతోంది. ఇప్పటికే వేలం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ భూములను కొనుగోలు చేయడానికి భారీ డిమాండ్ ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చడానికి హెచ్‌ఎండిఏ అహర్నిశలు శ్రమించింది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించడంతో పాటు ఒక్కో ఎకరం కనీసం ధరను రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. మాములుగా ఈ ప్లాట్లు అమ్ముడయితే ప్రభుత్వానికి సుమారుగా రూ.2,500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మాణాన్ని కూడా అధికారులు మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా ఈ-వేలం వేయడానికి కూడా హెచ్‌ఎండిఏ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్‌గా పేరు పెట్టారు.
ఔటర్ పక్కనే ఈ వెంచర్ ఉంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి ఔటర్ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్ ఛేంజ్‌లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి ఔటర్ మీదుగా నేరుగా నియోపోలీస్ లే ఔట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎకరా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ సంస్థలు, ఫార్మా, హోటళ్ల యజమానులు ఈ వేలంపై ఆసక్తి చూపిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. సుమారుగా 100 సంస్థలు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
గతంలో వేలం వేసినప్పుడు ఎకరా ధర రూ.40 కోట్లు…
గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినపుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈసారి దీనికి మించి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధరపలికే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలం ప్రక్రియను పూర్తి చేయడానికి హెచ్‌ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నియోపోలిస్ వెంచర్ ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేలంలో 60 నుంచి 80 మంది వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. నేడు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ఈ వేలం ముగియనుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను ఈనెల 16వ తేదీన వేలం వేయడా నికి టిఎస్‌ఐఐసి ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్‌అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ
నగరంలోని కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూముల వేలం ప్రక్రియ ఆపాలని కోరుతూ బిజెపి నేత, నటి విజయశాంతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈక్రమంలో కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రజా ప్రయోజనాల కోసం ఒక్కో జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాల భూబ్యాంకు ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, దానికి విరుద్ధంగా భూములను వేలం ద్వారా అమ్మేందుకు ఆదేశాలిచ్చిందని విజయశాంతి తరఫున న్యాయవాది వాదించారు. భూముల విక్రయానికి సబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివొ 13 కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఎలా ఉంటాయని ఈ సందర్భంగా ఎజిని హైకోర్టు ప్రశ్నించింది. కోకాపేటలో గతంలోనూ ప్రభుత్వం భూములు వేలం వేసిందని, ఆ జివొను హైకోర్టు సమర్థించిందని ఎజి ధర్మాసనానికి వివరించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎజి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అనంతరం కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేయడంతో వేలాన్ని నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలోని జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

TS Govt to e-auction of lands in Kokapet Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News