Wednesday, January 22, 2025

అసెంబ్లీ వేదికగా కేంద్రంపై ‘ఆర్ధిక సమరం’

- Advertisement -
- Advertisement -

కేంద్రంపై ఆర్ధిక సమరం
అసెంబ్లీ వేదికగా సరికొత్త రికార్డు
ఆదాయానికి భారీగా గండికొట్టిన కేంద్రం
ఇవ్వాల్సిన బకాయిలూ ఎగ్గొట్టిన కేంద్రం
పన్నుల వాటాకూ భారీ కోత
ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని గౌరవించిన తెలంగాణ
ఆ చట్టాన్ని ఉల్లంఘించిన కేంద్రం
ఆర్ధికంగా దెబ్బకొట్టడమే కేంద్రం ధేయమా
హక్కుగా ఉన్న రుణాలపైనా ఆంక్షలే…
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. సభలు, సమావేశాల్లోనే కాకుండా ఏకంగా అసెంబ్లీ వేదికగా కేంద్రప్రభుత్వ విధానాలను తూర్పారబట్టేందుకు నిర్ణయించిన రాష్ట్రంగా సరికొత్త రికార్డు సృష్టించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల మూలంగానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందనే ప్రధాన ఎజెండాతో చర్చలు జరిపేందుకు డిసెంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేదిక కానున్నాయి. ఇదొక సంచలనాత్మకమైన నిర్ణయమేనని సీనియర్ ఐ.ఎ.ఎస్.వర్గాలంటున్నాయి.

దేశంలోని ఏ రాష్ట ప్రభుత్వం కూడా ఇలా కేంద్రం విధానాలను ఎత్తిచూసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేదని, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే సరికొత్త రికార్డును సృష్టించబోతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంలో ఏకంగా 40 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని కోల్పోయామని అధికారికంగానే ప్రకటించి మరీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడమంటే ముమ్మాటికీ సాహసోపేతమైన చర్యేనని అంటున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ తీసుకొన్న విధానపరమైన నిర్ణయాల మూలంగా తెలంగాణ వంటి సంక్షేమ రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఆర్ధిక నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆ అధికారులు వివరించారు. ప్రాధమిక అంచనా ప్రకరామే రాష్ట్రానికి 40 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని, రికార్డుల ఆధారంగా లెక్కలు తీస్తున్నామని, ఆ లెక్కలన్నీ క్రోడీకరిస్తే ఆర్ధిక నష్టాలకు అంతులేని విధంగా ఉందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటాగా రాష్ట్రాలకు రావాల్సిన 41 శాతం నిధుల్లో ఆచరణలో రాష్ట్రానికి వస్తున్నది కేవలం 29 శాతం నిధులు మాత్రమేనని, ఈ విషయాన్ని ఇటీవల ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు అధికారికంగానే ప్రకటించారని ఆ అధికారులు వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు అనేక దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, వాటిని నేడున్న బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని, అయినప్పటికీ ప్రజల్లో అమలవుతున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో కొనసాగిస్తూనే ఉందని, దాని మూలంగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతోందని వివరించారు. అంతేగాక ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని గౌరవించి, ఆ చట్టానికి లోబడి తెచ్చుకొంటున్న రుణాలపైన కూడా కేంద్రం ఆంక్షలు విధించిందని, దాని మూలంగా వేలాది కోట్ల రూపాయల నిధులను నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి నెలకు కనీసం నాలుగు వేల కోట్ల నుంచి గరిష్టంగా ఆరు వేల కోట్ల రూపాయల వరకూ నిధులను తెచ్చుకోవచ్చునని, కానీ కేంద్రం కుట్రపూరితంగానే ఈ చట్టంలో మార్పులు చేసి నిధులు రాకుండా అడ్డుకుందని వివరించారు.

అంతేగాక ఈ చట్టానికి లోబడే 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో 54 వేల కోట్ల నిధులను సమీకరించుకొని అనేక పథకాలకు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో కూడా ప్రతిపాదనలు పెట్టామని, ఆ విషయాన్ని కేంద్రానికి నివేదించామని, అయినప్పటికీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో మార్పులు చేసినట్లుగా ప్రకటించి నిధులు రాకుండా కేంద్రం అడ్డుపుల్ల వేసిందని వివరించారు. దాంతో 54 వేల కోట్లకు బదులుగా కేవలం 39 వేల కోట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని, దీంతో ఏకంగా 15 వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇది కక్ష సాధింపుకాక మరేమిటీ అని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2022-23వ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ గడచిన ఎనిమిది నెలల్లో గరిష్టంగా 48 వేల కోట్ల రూపాయల నిధులను తెచ్చుకునే ఆస్కారముందని, కానీ కేంద్రం రూల్సు మార్చడం మూలంగా ఇప్పటి వరకూ సుమారు 12 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఆర్.బి.ఐ. నుంచి తెచ్చుకొన్నామని తెలిపారు. సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు కూడా అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆర్.బి.ఐ.వత్తిడి తెచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని, చేస్తూనే ఉన్నారని వివరించారు.

అదే విధంగా ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని ఉల్లంఘించి, తమ తాహతుకు మించి అప్పులు తెచ్చుకొంటున్న రాష్ట్రాలకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇచ్చుకొంటూ పోతోందని, అంతేగాక అసలు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టాన్ని కేంద్రమే ఉల్లంఘిస్తోందని, ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డుస్థాయిలో 90 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చుకొందని, దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు 68 ఏళ్ళల్లో కేవలం 80 లక్షల కోట్లను అప్పు చేయగా నేడున్న బిజెపి ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళల్లోనే ఏకంగా 75 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిందని, దీంతో కేంద్ర ప్రభుత్వ అప్పులు ప్రస్తుతం సుమారు 155 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆంక్షలు విధించి ఆర్ధికంగా నష్టపరిచిన కేంద్రం మాత్రం ఆ చట్టాన్ని ఉల్లంఘించి రికార్డుస్థాయిలో అప్పులు చేసిందనే అంశాలను కూడా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రజలకు కూలంకషంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 34,149 కోట్ల 71 లక్షల రూపాయల బకాయిలను ఎగ్గొంటిందని, ఈ విషయాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వీలుగా రాష్ట్ర మంత్రులకు టాకింగ్ పాయింట్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ అధికారులు వివరించారు. రాజ్యాంగానికి లోబడి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్, కేంద్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ నియమ, నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను కూడా నిలిపివేసిందని తెలిపారు. 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంవత్సరానికి 450 కోట్ల రూపాయల లెక్కన గడచిన మూడేళ్ళకు కలిపి 1,350 కోట్ల రూపాయల నిధులను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు పన్నులవాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్ధిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసింది. ఆ నిధులను కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2,350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది.

నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని, ఇలా ఈ మొత్తం బకాయిలను కలిపితే 34,149 కోట్ల 71 లక్షల రూపాయల వరకూ ఉన్నాయని వివరించారు. నీతి ఆయోగ్ వంటి అత్యున్నత సంస్థల సిఫారసులను కూడా కేంద్రం పట్టించుకోకపోతే ఎలా? అనే అంశాలు కూడా శాసనసభలో చర్చకు వస్తాయని వివరించారు. ఈ మొత్తం ఆర్ధికపరమైన అంశాలన్నీ రాష్ట్ర ప్రజలకు, దేశప్రజలకు తెలియజేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని డిసైడ్ అయ్యామని తెలిపారు.

TS Govt to fight on Centre from floor of Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News