Thursday, November 14, 2024

టెట్ అర్హత సర్టిఫికెట్లకే శాశ్వత వ్యాలిడిటీగా గుర్తింపు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలం చెల్లుతుందని ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కలిగి ఉన్న సర్టిఫికెట్లనే శాశ్వత వ్యాలిడిటీ సర్టిఫికెట్లుగా పరిగణించేలా త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక సర్టిఫికెట్లు అవసరం లేదని, పాత సర్టిఫికెట్లకే వ్యాలిడిటీ కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో టెట్ చెల్లుబాటు కాలం ఏడేళ్ళు ఉండేది, తాజాగా కేంద్రం దీనిని జీవిత కాలానికి పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన టెట్‌తో కలిపి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) నిబంధనల మేరకు 2011 జూలై 1వ తేదీన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది.

అనంతరం 2012 జనవరి 8న రెండవ టెట్, 2012 జూన్ 1న మూడవ టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2016, 2017లలో టెట్ నిర్వహించారు. 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. ఈ ఆరు టెట్ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2.50 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదివరకు ఉన్న ఏడేళ్ల నిబంధనతో ఇందులో సుమారు 2 లక్షల మంది అభ్యర్థుల వ్యాలిడిటీ ముగియగా, కేంద్రం తాజా నిర్ణయంతో వ్యాలిడిటీ ముగిసిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది.

TS Govt to issues TET lifetime validity certificates soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News