Wednesday, November 20, 2024

‘పోడు’కు శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -
TS Govt to pass resolution on Podu lands
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం,  అసెంబ్లీలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం సభలో తెలంగాణ రాష్ట్రంలో హరితహరం పై జరిగిన లఘుచర్చలో భాగంగా పోడుభూముల సమస్యపై సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ధరణి కార్యక్రమం కింద రాష్ట్రలోని భూములన్నింటినీ సర్వే చేయిస్తున్నామన్నారు. అధునాతన సాంకేతికతను ఇందుకు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. కరోనా వల్ల ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పోడు భూముల సమస్యపై కొందరు అధికారుల అత్యుత్సాహం వల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల ఎకరాల వరకూ పోడు సమస్య ఉందన్నారు. పోడు సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులతో చర్చించామని తెలిపారు. గిరిజనులపై దాడులు చేయవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. కాగా సుప్రీంకోర్టు చట్టాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల యాజమాన్య హక్కు మారదని సిఎం స్పష్టం చేశారు. ఓనర్ షిప్ అటవీశాఖకే ఉంటుందన్నారు. ఈ సమస్యను మానవతా దృక్ఫదంతో చూడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005 వరకూ పోడు భూముల సర్వే చేసి వాటిని సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 3.8లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 96,676మంది రైతులకు ఆర్‌ఓర్ కల్పిస్తూ పట్టాలు ఇచ్చారని తెలిపారు. వీరికి రైతుబంధు పథకం కూడా వర్తింపచేస్తున్నట్టు తెలిపారు.

పోడు భూముల సమస్యను త్వరలోనే తేలుస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం పోడు భూములు ఎంత, పట్టాలు పొందినవి ఎంత , ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఎంత అన్నది లెక్క తేలుస్తామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాలో ఈ సమస్య ఉండవచ్చని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేద్దామన్నారు. అనంతరం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడిని కలిసి సమస్యను వివరించి 2005తర్వాత ముగిసిన కటాఫ్ డేట్‌ను మరికొంత పెంచమని కోరదామని సిఎం కెసిఆర్ సభ్యులకు వివరించారు. పొరుగున చత్తిస్‌గడ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు కూడా మన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లోకి చొచ్చుకువచ్చి ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించుకునే సమస్య కూడా ఉందన్నారు. పోడుభూముల సమస్యపై ఇటీవల తాను కొన్ని జిల్లాల్లో శాంపిల్ సర్వే చేయించినట్టు తెలిపారు.

కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావని, . 100 శాతం అది రాష్ట్రాల డబ్బులు మాత్రమే అని సిఎం స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టులు, రోడ్లకు, లేదా ఇతర అవసరాల కోసం అటవీ భూములను కొనుగోలు చేస్తామని . అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బులు చెల్లించాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్రం వద్ద జమ చేసిన డబ్బు రూ. 4675 కోట్లు వుందని , ఇవి మనం కట్టిన డబ్బులే తప్ప కేంద్రానిది నయా పైసా కూడా లేదన్నారు. అయితే తాము ప్రధాని మోదీని కలిసి కాంపా నిధులు విడుదల చేయాలని కోరామన్నారు. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత విడుదలయ్యాయని తెలిపారు. మనకు ఇచ్చే నిధుల్లో 10 శాతం కేంద్రం కట్ చేస్తుందని , నిధులు మొత్తం ఇవ్వాలని కోరగా , పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు.రాష్ట్రంలో ఎక్కడా అసైన్డ్ భూములను లాక్కోవడం లేదన్నారు.

భూములను లాక్కోవడం మా ప్రభుత్వం పని కాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములను తీసుకుంటున్నాం. వారికి నష్ట పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకుంటే మీ దృష్టిలో ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని విపక్ష సభ్యులకు సిఎం సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు గవర్నమెంట్ ల్యాండ్‌నే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. -టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వీలైనంత వరకు అసైన్డ్ భూములను లాక్కోవడం లేదన్నారు. వారి బతుకుదెరువు కోసం ప్రభుత్వమే ఇచ్చిన భూములు కాబట్టి, వారి ఉపాధి పోకుండా చూడాలన్నారు. అతి తక్కువ స్థాయిలో తప్పని పరిస్థితుల్లో వారి భూములు తీసుకుంటే. ఇతరులకు ఏ విధమైన నష్ట పరిహారం ఇస్తున్నామో అదే విధంగా 100 శాతం నష్ట పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు.

భూములకు నీరు పోవాలంటే ఆ భూముల గుండానే కాల్వ పోతుంటే అటువంటి పరిస్థితుల్లో కొంత భూమి తీసుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సభ్యుడు పోడెం వీరయ్య మాట్లాడతూ ప్రతిసారి ఇలాగే చెబుతున్నారే తప్ప గిరిజను భూముల సమస్య పరిష్కారం కానేలేదన్నారు. ఈ సారైనా న్యాయం చేయాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన సందర్బంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో విలీనం చేయటం వల్ల భద్రాచలంను ఐలాండ్‌గా మర్చారన్నారు. ఎపి సిఎం జగన్‌తో మాట్లాడి కనీసం 5గ్రామాలైనా వెనక్కు ఇప్పించాలని కోరారు. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ ఎపి ప్రభుత్వంతో మాట్లడతామన్నారు. పరిష్కారం కాకపోతే ఈ సమస్యను కూడా ప్రధాని వద్దకు తీసుకుపోతామన్నారు. ఏడు మండలాలను ఎపిలో విలీనం చేయటమే అన్యాయం అని తొలుత ఈ నిర్ణయాన్ని ప్రధానితో తానే గట్టిగా వ్యతిరేకించానని సిఎం తెలిపారు.

ఎంఐఎం సభ్యులు అగ్బరుద్దీన్ మాట్లాడుతూ అడవుల అభివృద్ధిలో 2017నాటికే 1396కోట్లు ఖర్చు చేసి 3.67శాతం పచ్చదనాన్ని పెంచినట్టు నివేదిక ఇచ్చారని మరి ఇప్పుడు ఆరు వేలకోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారని దీన్ని బట్టి పచ్చదనం ఎంత శాతం పెరిగిందో తెలపాలన్నారు. బహదూర్‌పురా నియోజకవర్గంలో అసలు అడవులే ఉన్నట్టు చూపలేదని మరి 381ఎకరాల్లో ఉన్న జంతు ప్రదర్శన శాల అడవుల కిందకు రాదా అని ప్రశ్నించారు. దీనిపై సిఎం స్పందిస్తూ జూ వైల్డ్ లైఫ్ విభాగం కిందకు వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ చెట్లు పెంచటం కాంగ్రెస్ నినాదం అన్నారు. గిరిజనుల భూములు ప్రభుత్వం సేకరించరాదన్నాకొరారు. బిజెపి సభ్యులు రాజాసింగ్ మాట్లాడుతూ హరితనిధిని స్వాగతిస్తున్నామన్నారు.

82,491 కి.మీ. మేర ప్లాంటేషన్

రాష్ట్రంలో రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకాన్ని సిఎం వివరిస్తూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ కింద 67,276 కి.మీ. ఆర్ అండ్ బీ కింద 28,080 కి.మీ. నేషనల్ హైవేస్ కింద 4 వేల కి.మీ. ఉన్నాయని తెలిపారు. అన్నీ కలిపితే 1,00,156 కి.మీ. మేర రోడ్ లెంత్ ఉందన్నారు. ఇందులో 82491 కి.మీ. మేర ప్లాంటేషన్ చేశారన్నారు. పంచాయతీరాజ్ కింద 59 వేల కిలోమీటర్లు కవర్ చేశారన్నారు. ఆర్ అండ్ ద్వారా 8652 కి.మీ. మేర మొక్కలు నాటారన్నారు. అటవీశాఖ అధికారులు.. జాతీయ రహదారులపై మొక్కలు నాటి, వారి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

గ్రీనరీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్ గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించింది అని సిఎం గుర్తు చేశారు.మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగమని, దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, వర్షాలు తగ్గిపోయి కరువులు వచ్చాయన్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారన్నారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్లో ఓ పార్టీ పేరే గ్రీన్ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News