Wednesday, January 22, 2025

తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు

- Advertisement -
- Advertisement -

దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్ ఉంటే చాలు వారి తలరాతను మార్చగలనన్న సంకల్పం ఉంటే ఎంతటి సమస్య అయినా తలవంచక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ సరఫరాలను అనుభవిస్తున్నము. రైతులకు 24 గం. కరెంటు ఇవ్వడం గొప్ప ఆలోచన. రైతులకు మేలు చేయడం కన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదు. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గం. పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. నేడు యావత్ దేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పని చేశారు.

దాని ఫలితంగానే ఇప్పుడు అన్ని రంగాలకు 24 గం. పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకున్నాము.విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి, పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్ తోనే అభివృద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. రాష్ట్రంలో 26.96 లక్షల మంది రైతులకు 24 గం. ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ రంగానికి 24 గం. పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ ఘనతను ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కొన్ని రా్రష్ట్రాలు 9 గం. పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 24 గం. సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ ఉచితంగా ఇవ్వడం లేదు.

ఉచితంగా 24 గం. వ్యవసాయ కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రోజుకి నాలుగు నుండి ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలు, పారిశ్రామిక రంగానికి వారానికి రెండుసార్లు పవర్ హాలిడేలు ఉండేవి. వ్యవసాయ రంగానికి గతంలో నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. 2014కి ముందు ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం, మోటార్లు దగ్ధం కావడం వంటి ఫిర్యాదులు సర్వసాధారణం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పాము కాటు, విద్యుదాఘాతానికి గురై రైతులు మరణించిన సంఘటనలు అనేకం.తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 6,574 మెగావాట్లు. గ్రామాల్లో 6 నుంచి 8 గంటలు, పట్టణాల్లో 4 నుంచి 6 గంటలు, హైదరాబాద్‌లో 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. తెలంగాణలో కరెంటు కోతలు ఉండకూడదని నిర్ణయించిన ప్రభుత్వం అందుక తగ్గ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఐదు నెలలకే నవంబర్ 20వ తేదీ 2014 నుంచి పరిశ్రమలకు, గృహాలకు, వాణిజ్య సంస్థలకు 24 గం. పాటు విద్యుత్ సరఫరా చేసింది.

ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు, కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన కరెంటు సరఫరా కోసం పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు ముందుకుపోతున్నాయి. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చేసిన ఏర్పాట్ల ఫలితంగా అదనంగా 8,271 మెగావాట్లు విద్యుత్‌ను రాష్ట్రం సమకూర్చుకున్నది. దీంతో ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీరు, విద్యుత్ సరఫరా.
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోయా యి. 2014 నుండి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వ్యవసాయ రంగానికి రూ. 36,890 కోట్ల సబ్సిడీని అందించారు. ఇది కాకుండా రాష్ట్రంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రూ.37,099 కోట్లు ఖర్చు చేసింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని అధికారులు తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు కాగా, 2021 నాటికి 2012 యూనిట్లకు చేరుకుంది. ప్రసార, పంపిణీ నష్టాలు 16.06% నుంచి 11.01 శాతానికి తగ్గాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి సౌర విద్యుత్ సామర్థ్యం 73 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 4950 మెగావాట్లకు చేరుకుంది. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుండి ఇప్పటి వరకు 5,96,642 మంది ఎస్‌సి వినియోగదారులకు, 3,21,736 ఎస్‌టి వినియోగదారులకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.

ఈ వినియోగదారులకు సరఫరా చేయబడిన ఉచిత విద్యుత్ కోసం మొత్తం ఖర్చు రూ. 656 కోట్లు.
అదే విధంగా దాదాపు 29,365 నాయీబ్రాహ్మణుల సెలూన్లు, 56,616 లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు 6667 పౌల్ట్రీ యూనిట్లు, 491 పవర్ లూమ్‌లకు యూనిట్‌కు రూ.2 సబ్సిడీతో సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులకు 24 గం. పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఫలితం దక్కాలంటే ఆటో స్టార్టర్లు వందశాతం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చేనాటికి భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కరెంటు అందుబాటులో ఉన్నా భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే చివరికి 24 గం. కరెంటు సరఫరా ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటో స్టార్టర్లను తొలగించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా, సిఎం కెసిఆర్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య 18,567 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు పెంచి రూ. 12,727 కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగం, ట్రాన్స్‌మిషన్, పంపిణీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ. 38,070 కోట్లు ఖర్చు ఆర్థిక ప్రగతికి సూచిక. 2014-15లో విద్యుత్ తలసరి వినియోగం 1,356 యూనిట్లు, 2021 -22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు. జాతీయ సగటు కంటే తెలంగాణ వినియోగం 69% ఎక్కువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News