Monday, December 23, 2024

బండి సంజయ్ పాదయాత్రకు పర్మిషన్

- Advertisement -
- Advertisement -

బండి సంజయ్ పాదయాత్రకు పర్మిషన్
షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు
బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలి
బైంసా టౌన్‌కు 3 కి.మీ దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసిన న్యాయస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలని తెలిపింది. అలాగే బహిరంగ సభను బైంసా టౌన్‌లో నిర్వహించడానికి వీల్లేదని, సిటీకి 3 కిలో మీటర్ల దూరంలో నిర్వహిస్తేనే సభకు అనుమతించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అంశంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్ మ్యాప్ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. బైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనపుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ… ఆ ప్రాంతం చాలా సున్నితమైనదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

TS HC gives Conditional Permission for Bandi Sanjay Padayatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News