సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాల్సింది
జమున హేచరీస్ అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు విచారణ
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం
విచారణ జులై 6కు వాయిదా వేసిన న్యాయస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధించిన జమునా హెచరీస్ అత్యవసర పిటిషన్‌పై మంగళవారం నాడు న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. మెదక్ కలెక్టర్ నివేదిక తప్పుల తడకగా ఉందని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ జరిపారని జమున హచరీస్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము కబ్జాలకు పాల్పడలేదని, తమ అనుమతి లేకుండా హెచరీస్‌లోకి ప్రవేశించిన మెదక్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఈటల కుటింబీకులు కోర్టును ఆశ్రయించారు. అచ్చంపేటలో జమునహెచరీస్ భూమిలోకి అక్రమంగా వెళ్లి సర్వే చేశారని, కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా భూమి సర్వే ఎలా చేస్తారని జమున హెచరీస్ తరపు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. జమున హెచరీస్‌పై కలెక్టర్,రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్ట ప్రకారం ఆ చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే చీఫ్ సెక్రటరీ నుంచి విచారణ చేయవలసిందిగా ఎప్పుడు ఆదేశాలు వచ్చాయని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఏప్రిల్ 30 నుంచి మే 1వ తేదీ వరకు ఆదేశాలు జారీ చేయటం, నివేదిక సమర్పించడం జరిగిందని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఎన్ని గంటల్లో నివేదిక ఇచ్చారని? విచారణ సమయంలో పిటిషనర్ నుంచి వివరణ తీసుకున్నారా ? నోటీస్ ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. కనీస నోటీస్ ఇవ్వకుండా విచారణ కు ఎలా వెళ్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించగా దీనికి హైకోర్టు వివరణ ఇచ్చింది. విచారణకు వెళ్లే కలెక్టర్ ఎలాంటి నిబంధనలైనా ఉల్లఘించవచ్చనే విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 156 సెక్షన్ ప్రకారం ప్రతి రెవెన్యూ అధికారికి భూమిలోకి ప్రవేశించే అధికారం ఉంటుందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కలెక్టర్ నివేదికపై హైకోర్ట్ సీరియస్‌గా స్పందించింది. కాగా విచారణ సమయంలో కనీస ప్రోటోకాల్ పాటించలేదని, 300(a) కన్సిస్టిశనల్ రైట్‌ను ఉల్లంఘించారని ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇంటీర్మ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోరారు. ఓవర్ నైట్‌లో విచారణ చేసి నివేదిక ఇస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, మంత్రి పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇలాంటి ఫిర్యాదులు గతంలో చాలా మందిపై వచ్చాయి. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ఎజిని ప్రశ్నించింది. 111 జివొ అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది.
అధికారులు మాజీ మంత్రి ఈటల కుటింబీకులకు ముందుస్తు నోటీసులు జారీ చేసారా. ఒక వేళ జారీ చేస్తే ఆ ఉత్తర్వులను కోర్టుకు చూపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మధ్యాహ్ననికి సమయం కోరారు ఏజీ. దీంతో హైకోర్టు తదుపరి విచారణను మధ్యాహ్ననికి వాయిదా వేసింది. అనంతరం జరిగిన విచారణలో జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. జమున హచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈటల కుటుంబం దాఖలు చేసిన సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సహజ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించారని స్పష్టం చేసింది. కలెక్టర్ నివేదికతో ప్రమేయం లేకుండా చట్టప్రకారం వ్యవహరించవచ్చని హైకోర్టు సూచించింది. అయితే నివేదిక ప్రకారం నేరానికి పాల్పడినట్టు రుజువైందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. విచారణకు సహకరించేలా పిటిషనర్లను ఆదేశించాలని అడ్వొకేట్ జనరల్ కోరగా పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం వ్యవహరించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసింది.
TS HC notice to Govt on Jamuna Hatcheries