Tuesday, November 5, 2024

గణతంత్ర స్ఫూర్తిని చాటేలా పరేడ్‌ నిర్వహించాల్సిందే: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గణతంత్ర స్ఫూర్తిని చాటేలా పరేడ్ కూడిన వేడుకలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని స్పష్టం చేసింది. ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.

ఈనెల 13వ తేదీనే రాజ్ భవనకు లేఖ రాశామని.. రాష్ట్రంలో కొవిడ్ ఉన్నందున రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని కోరినట్లు కోర్టుకు తెలిపారు. రాజ్ భవన్‌లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఎజి తెలిపారు. రాజభవన్‌లో గణతంత్ర వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్ కాస్టింగ్ చేస్తామని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం.. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది.

కాబట్టి వీటన్నింటిని తాము పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలని, పరేడ్ కూడా నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని తెలిపింది. హైకోర్టులో సైతం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News