Monday, November 18, 2024

న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉంది. తీవ్ర గర్హనీయం. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలి. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలి. విశ్వాసాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి” అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.కాగా హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు- వెంకట నాగమణి బుధవారం దారుణ హత్యకు గురైన విషయం విదితమే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై దుండగులు వీరిపై దాడి చేసి హతమార్చారు. ఈ క్రమంలో, వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భగ్గుమన్న బార్ కౌన్సిల్:
వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా బార్‌కౌన్సిల్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి న్యాయస్థానాల ముందు ఆందోళనకు దిగింది. హైకోర్టులోనూ బార్ అసోషియేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి కోర్టుల్లో విధులు బహిష్కరించారు. నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.న్యాయవాదుల హత్యను ఖండిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ గళమెత్తారు. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట రహదారిపై లాయర్లు బైఠాయించారు. ధర్నాతో ఎల్‌బినగర్, దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనకు బిజెపి ఎంఎల్‌సి రాంచందర్‌రావు మద్దతు తెలిపారు. వామన్‌రావు దంపతుల హత్యను న్యాయవాద వ్యవస్థ మీద దాడిగా ఎంఎల్‌సి రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. న్యాయవాద దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.న్యాయవాదుల హత్యకు నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్ల ఆందోళన చేపట్టారు. సివిల్ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. సైఫాబాద్ సమీపంలో లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు ధర్నా చేశారు.

TS HC takes Suo motu lawyer’s Couple murder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News