హైదరాబాద్: కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలన కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. వేరే రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని సూచించారు. రెండో టీకా తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు మూడో డోసు తీసుకోవాలని పేర్కొన్నారు. 12-17 ఏళ్ల వయసు వారు రెండో టీకా తీసుకోవాలని చెప్పారు. 60 ఏళ్లు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని తెలిపారు.
18-59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయి. వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు. ప్రజల సహకారంతో రెండు దశల్లోనూ కరోనాను సమర్థంగా నియంత్రించగలిగామని ఆయన స్పష్టం చేశారు. సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్ వేవ్ కు అవకాశం లేదని డిహెచ్ తెలిపారు. ప్రజల్లో 93శాతం యాంటీబాడీస్ ఉన్నాయి. ఫోర్త్ వేవ్ పై అనేక సందేహాలున్నాయి. రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని డిహెచ్ వెల్లడించారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని వార్నింగ్ ఇచ్చిన ఆయన మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా విధిస్తామన్నారు.