హైదరాబాద్: ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని మంత్రి తేల్చిచెప్పారు. కేసులు పెరుగుతున్నా… మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. ప్రజలు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదని, హోంఐసోలేషన్ లో ఉన్నవారికి విధిగా మానిటర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఐసోలేషన్ లో ఉన్నవారికి కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసులు పెరుగుతున్న… ఎక్కువ మందిలో లక్షణాలు లేవని ఈటల తెలిపారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కిట్ ఇస్తున్నాం. టెస్టులకు అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతుందని మంత్రి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లూ అందుబాటులో ఉన్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రైవేటు దవాఖానాల్లో కరోనా ఫీజు సాధ్యమైనంత తగ్గించి సామాజిక బాధ్యతగా సేవలు అందించాలని కోరారు.
TS Health Minister Etela Rajender Review On Covid-19