అమ్మకాలను తప్పుబట్టలేమని చెప్పిన తెలంగాణ హైకోర్టు
కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయానికి పచ్చజెండా
భూముల విక్రయాలపై హైకోర్టులో పిల్ వేసిన బిజేపి నాయకురాలు విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. అయితే టెండర్లు, ఈ వేలం వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం భూములను విక్రయించుకోవచ్చని తెలిపింది. హెచ్‌ఎండిఏ పరిధిలోని కోకాపేట, ఖానామెట్‌లోని భూముల విక్రయాలపై గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బిజేపి నాయకురాలు విజయశాంతి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు చెప్పింది.
ప్రభుత్వం తమ భూములు విక్రయించుకోకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలేమిటో పిటిషనర్ తెలుపలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం తెలిపింది. చట్టాలను అనుసరిస్తూ, నిబంధనల మేరకు ప్రభుత్వం భూములను విక్రయించవచ్చని పేర్కొంటూ ధర్మాసనం పిల్‌పై విచారణను ముగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో ఐటి పార్క్‌లను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భూములను ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలకు అనుగుణంగా ప్రకటన విడుదల చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ బిజేపి నాయకురాలు విజయశాంతి కోర్టు పిల్ దాఖలు చేసింది.