మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టు బుధవారం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. ఈక్రమంలో చిన్నారుల అదృశ్యంపై సర్కారు మరింత శ్రద్ధ వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై విచారణలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో జువైనల్ బోర్డులు, సంరక్షణ గృహాలు లేవని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అలాగే పోలీస్ స్టేషన్లలో బాలల సంరక్షణ అధికారులు లేరని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా దృష్టి పెట్టి పరిష్కరించాలని సూచించిన హైకోర్టు వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
ట్రాన్స్‌జెండర్ల వ్యాక్సిన్‌పై విచారణ ః
కరోనా వేళ ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై ఉన్నత న్యాయస్థానంలో బుధవారం విచారణ జరిగింది. వ్యాక్సిన్ల కోసం ట్రాన్స్‌జెండర్లు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ ప్రస్తావించగా వారితో సమన్వయం చేసుకోవాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది. జిల్లాలవారీగా ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధుల వివరాలు అడ్వొకేట్ జనరల్‌కి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
TS High Court heard on missing of children