Sunday, December 22, 2024

సుమోటోగా ట్యాపింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టు సు మోటోగా విచారణకు స్వీకరించింది. పలు పత్రికల్లో వరస కథనాలు రావడంతో ఈ మేరకు స్పందించింది. ఈ విషయంపై పత్రికల్లో వెలువడిన కథనాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. గతంలో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ ను సైతంట్యాప్ చేసినట్లు మాజీ అడిషినల్ ఎస్‌పి భుజంగరావు అంగీకరించినట్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. వాటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యా పింగ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను పరిశీలించిన హైకోర్టు సు మోటో పిటిషన్ గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే,

జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎస్‌ఐబిలో పనిచేసిన అడిషినల్ ఎస్‌పి భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బిఆర్‌ఎస్ మంత్రి కెటిఆర్‌ను విమర్శించే ప్రతి రాజకీయ నాయకులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎస్‌ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్రావు సూచనలతో మేకల తిరుపతన్న, డి.ప్రణీత్‌రావు, టాస్క్ ఫోర్సు మాజీ డిసిసి జి రాధాకిషన్ లు ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కథనాలు ప్రచురిత మయ్యాయి. ఉగ్రవాదుల ఆచూకీ నిమిత్తం వినియోగించే పరికరాల సాయంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతోపాటు న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాల గురించి వివరాలు సేకరిస్తారని భుజంగరావు వెల్లడించినట్లు పేర్కొన్నాయి. వీరితోపాటు విద్యార్థినేతలు, ప్రతిపక్ష నేతల కుటుంబాలు,

జర్నలిస్టులపై నిఘా ఉంటుందని పేర్కొన్నాయి దుబ్బాక, హుజూర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో దీనిని ఉపయోగించినట్లు, బిఆర్‌ఎస్‌ను మూడో సారి అధికారంలోకి తీసుకురావడానికి తామంతా కృషి చేసినట్లు భుజంగరావు పేర్కొన్నారని, బిఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో ప్రముఖ కంపెనీలు, వ్యక్తులకు చెందిన సివిల్ వివాదాలను సెటిల్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల డబ్బులను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నట్లు భుజంగ రావు చెప్పినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. భుజంగారావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న వాంగ్మూలాల ఆధారంగా పలు కథనాలు వచ్చాయి. పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలించిన హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం సిజె ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News