వైఎస్ షర్మిలకు హైకోర్టు మరో సారి హెచ్చరిక
వ్యక్తిగత విమర్శలకు పోవద్దు
హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై వ్యాఖ్యలు తగదు
షరతులతో పాదయాత్రకు అనుమతి
హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకుపోయారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా షర్మిల బిఆర్‌ఎస్ పార్టీ నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తెలంగాణను తాలిబన్ల రాష్ట్రంగా మారుస్తున్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.
దీనిపై హైకోర్డు స్పందిస్తూ హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రం గురించి వ్యాఖ్యానించడం సరికాదని సున్నితంగా మందలించింది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సాధారనం అని అభిప్రాయపడింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం షర్మిల పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలను హైకోర్టు హెచ్చరించింది.
ఇటీవల వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు అనుమతి ర్దదు చేశారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ సభ్యుడు రవీంధ్రనాద్ రెడ్డి తోపాటు మరికొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది. సిఎం కేసిఆర్‌పైనా రాజకీయ, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆదేశించింది. పాదయాత్రకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కూడా ఆదేశించింది. పాదయాత్ర వల్ల ఉద్రిక్తతుల చోటు చేసుకుంటాయన్న అభిప్రాయంతో పోలీసులు షర్మిల పాదయాత్రను నిలిపివేయించారు.
దీంతో పార్టీ నేతలు మరో మారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు షరతులతో కూడిన ఆనుమతి ఇస్తూ హైదకోర్టు ఆదేశాలిచ్చింది.ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌టిపి లీగల్ సెల్ అధ్యక్షుడు డా.వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రను కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలిపిందన్నారు. పాదయాత్రను నిబంధనలకు అనుకూలంగానే చేస్తున్నట్టు తెలిపారు. న్యాయస్థానంపైన తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు.ఇప్పటికైనా పోలీసులు తమను పాదయాత్ర చేయనిస్తారని నమ్ముతున్నామని ,పోలీసులు సహకరించకపోతే మరో పిటీషన్ ధాఖలు చేస్తామని వరప్రసాద్ పేర్కొన్నారు.