ఉదయం 9 గం.ల నుండి 12 గం. ల వరకు పరీక్ష
నిముషం ఆలస్యమైనా అనుమతించరు
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్
హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1443 పరీక్షా కేంద్రాల్లో 9 లక్షల 7,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఒమర్ జలీల్ విద్యార్థులకు సూచించారు. 30 నిముషాల ముందు నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
నిముషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 4 లక్షల 64 వేల 626 మంది విద్యార్థులు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు 4లక్షల 42 వేల 762 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియిర్ పేపర్లకు సెకండియర్‌లో ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం కల్పించారు. పరీక్ష జరుగుతున్నంత సేపు ఇన్విజిలేటర్లు, సిఎస్, డిఓ ఏ ఒక్కరు కూడా ఫోన్ వాడకూడదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కూడా 70 శాతం సిలబస్ ప్రకారమే జరుగనున్నాయి. దీంతో పాటు ప్రశ్నపత్రాలలో విద్యార్థులకు చాయిస్ కూడా పెరిగింది.