మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం(మార్చి 5) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలకు 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కా ర్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు ఉదయం 8.45 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అయితే ఉదయం 9 తరువాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా కూడా అనుమతిస్తామని వెల్లడించారు.విద్యార్థులకు 1,2 నిమిషాలు
నుంచి 5 నిమిషాల వరకు గ్రేస్ టైమ్ ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షా సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు వస్తే ఒఎంఆర్ షీట్ ప్రశాంతంగా నింపుకోవచ్చని, హడావుడి ఉండదని, ఒత్తిడి ఉండదని చెప్పారు. అందుకే ఉదయం 8.45 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నేపథ్యంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద భాయి, ఇతర అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,40,788 మంది ఉన్నారని అన్నారు.
విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు
ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దాంతోపాటు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు పంపించినట్లు తెలిపారు. విద్యార్థులు ఎస్‌ఎంఎస్ లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు.
31 స్క్రీన్లతో పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ
ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రశ్నపత్రం కూర్పు మొదలు కొని, పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్ల వరకూ జాగ్రత్తలు పాటించామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో 5 నుంచి 6 సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్‌లో 31 స్క్రీన్లతో పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశామని, ఇందుకోసం 75 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్(బిఆన్‌ఎస్ 163) అమలులో ఉంటుందని తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం 1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1532 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 29,992 మంది ఇన్విజిలేటర్లను, 124 సిట్టింగ్ స్క్వాడ్లు, 72 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్‌ను రంగంలోకి నియమించినట్లు సెక్రటరీ వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రిటెండ్ మెటీరియల్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, సిబ్బందికి కూడా సెల్‌ఫోన్ అనుమతి ఉండదని అన్నారు. విద్యార్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడుపనున్నట్లు కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఒక నర్సు, ఒక ఆశా వర్కర్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.-
విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్
మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడితో ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు 9240205555 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. హాల్ టికెట్, ఇతర సమస్యలతో పాటు మానసిక నిపుణులు, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగానికి చెందిన నిపుణులు అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు.