మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు
ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 2 నుంచి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉండనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న నైతికత, మానవ విలువలు (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్), ఏప్రిల్ 3న పర్యావరణ విద్య(ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
సెలవు రోజుల్లోనూ పరీక్షలు
కొవిడ్-19 పరిస్థితుల కారణంగాఈసారి ఇంటర్ పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సెలవు రోజుల్లోనూ నిర్వహించనున్నారు. రెండవ శనివారం, ఆదివారాలతోపాటు ఇతర సెలవు రోజుల్లో కూడా పరీక్షలు జరుగనున్నాయి.
TS Inter Exams 2021 to be held from May 1