మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేయగా, పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై ఇటీవల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటర్మీడియేట్ రెండవ ఏడాది విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులు కేటాయించాలని మార్గదర్శకాలలో పేర్కొంది. అందుకనుగుణంగా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు కేటాయించనున్నారు.
గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండవ ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాలలో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 4,73,967మంది ఉన్నారు. ఈ విద్యార్థులందరూ ఈసారి పరీక్షలు లేకుండానే పాస్ కానున్నారు.
TS Inter Exams Results 2021 released tomorrow