రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు బుధవారం నుంచి లాసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన సోమవారం జరిగిన లాసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అర్హులైన అభ్యర్థులు బుధవారం నుంచి ఈ నెల 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని అన్నారు. ఈ నెల 17న అర్హులైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుచుతామని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 18, 19 తేదీలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 20న ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించి, 22న ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23 నుంచి 26 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అన్నారు. ఇతర వివరాల కోసం http://lawcet.tsche.ac.in వెబ్‌సైట్ చూడాలని తెలిపారు.