మనతెలంగాణ/హైదరాబాద్: పాక్షిక లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని సిపి, ఐజి, ఎస్‌పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 3600 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో తొమ్మిది రోజులుగా అమలవుతున్న పాక్షిక లాక్‌డౌన్‌లో కరోనా,కర్ఫూ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఇప్పటి వరకు 75వేల వరకు కేసులు నమోదు చేయడంతో పాటు వేలాది వాహనాలు జప్తు చేసి కఠినంగా వ్యవహరించినట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో జిల్లాల వారీగా లాక్‌డౌన్ అమలు తీరును సిఎం కెసిఆర్ రోజూ సమీక్షిస్తుండటంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ అమలుపట్ల డిజిపి సైతం సీరియస్ కావడంతో కమిషనర్ నుంచి ఎసిపి స్థాయి అధికారి వరకు రహదారులపై తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో డిజిపి ఆదేశాలతో గురువారం నాటి నుంచి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కమిషనర్లు, ఏసీపీలు ఉదయం 9.45 గంటలకే క్షేత్రస్థాయిలో పరీస్థితులను సమీక్షించారు. 10 గంటలకు అన్ని గస్తీల్లో వాహనాలు సైరన్ మోగించాయి. కరోనా వ్యాప్తికి అవకాశమున్న చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. డిజిపి ఆదేశాలలో అన్ని జిల్లాల్లోనూ లౌక్‌డౌన్ ఆంక్షలను జిల్లా ఎస్‌పిలు పక్కాగా అమలుచేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్‌లో నిబంధనలు అతిక్రమించిన 60 వాహనాలు జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉల్లంఘనులపై 8 వేల కేసులు నమోదు చేసినట్లు డిసిపి నారాయణరెడ్డి వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాలోనూ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లౌక్‌డౌన్ స్ఫూర్తిని ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కరీంనగర్ సిపి కమలాసన్‌రెడ్డి కోరారు. నిబంధనల అమలును సీపీ స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు దాదాపు 200మంది వాలంటీర్లను నియమించినట్లు వివరించారు. లాక్‌డౌన్ నిబంధనలపై వ్యాపారులకు రామగుండం సిపి సత్యనారాయణ అవగాహన కల్పించారు. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.వికారాబాద్ జిల్లాలో పరిగిలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినతరం చేశారు. రిలాక్సేషన్ తరువాత రోడ్లుపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల కదలికలను డ్రోన్ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మైత్రి వెంచర్‌లో వాలీబాల్ ఆడుతూ కొందరు యువకులు డ్రోన్ కెమెరాకు చిక్కారు. డ్రోన్‌ను చూడగానే యువకులు పరుగులు తీశారు. డ్రోన్ కెమెరాలో రికార్డు అయినా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉదయం పది తర్వాత ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.ప్రధాన కూడళ్లు, కాలనీల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిచిన 350 వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అనసవరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లాలో నిబంధనలను అతిక్రమించే వారిపై దాదాపు 500 కేసుల నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటున్నామని ఎసిపి అఖిల్ మహాజన్ తెలిపారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీ చేపట్టారు. గద్వాలలో ప్రధాన కూడళ్లలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ స్వయంగా పర్యవేక్షించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు జప్తు చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర 10 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ:
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా లౌక్‌డౌన్ నిబంధనలు అమలుచేస్తున్నట్లు సిపి మహేశ్ భగవత్ స్పష్టంచేశారు. అతిక్రమంచిన 21 వేల మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ, బేగంపేట్, గోపాలపురం, సంగీత్ చౌరస్తా వద్ద పోలీసులు దాదాపు 400 వాహనాలు సీజ్ చేశారు. కూకట్‌పల్లి జాతీయరహదారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేశారు.
5 వేల మంది సిబ్బందితో
సైబరాబాద్ పరిధిలోని మియాపూర్, చందానగర్ ఠాణాల పరిధిలో నిబంధనలను కఠినతరం చేశారు. సనత్‌నగర్ ఠాణా పరిధిలోని మూసాపేట వంతెన, ఎర్రగడ్డ రైతు బజార్, అమీర్‌పేట మైత్రివనం వద్ద పలు వాహనాలు జప్తు చేశారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో లౌక్‌డౌన్ అమలుతీరును సిపి సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. 75 చెక్ పోస్టులు, 5వేల మంది సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. రామచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధిలోనూ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను నగరవాసులు కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మరింత సీరియస్‌గా లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలను పొందాలంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని.. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వారు ఎవరు రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు పోలీసులు.
నకిలీ పాసుల గుర్తింపు:
హైదరాబాద్ నగరంలో గురువారం వాహనాల తనిఖీలో భాగంగా పోలీసు అధికారులు నకిలీ పాసుల గుర్తించారు అధికారులు. చాలా మంది అత్యవసర సేవల పేరుతో నకిలీ పాసులను సృష్టించినట్టు తేలింది. కేవలం పదినిముషాల్లోనే.. 20కిపైగా నకిలీ పాసులను గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
మోటార్ వెహికల్ యాక్ట్:
రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయంలో బయట వాహనాలతో సంచరించే వారిపై మోటార్ వెహికల్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను తీసుకోవాలంటే నెల రోజులకు పైగా సమయం పడుతుందని, నగర వాసులు లాక్ డౌన్ సమయంలో రోడ్ల పైకి వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
TS Lockdown: Police to Impose strict rules