రోగుల కోసం ఆసుపత్రులు సిద్దం చేస్తున్న సిబ్బంది
మళ్లీ పుంజుకుంటోండటంతో అప్రమత్తమైన అధికారులు
టిమ్స్,గాంధీ, కింగ్‌కోఠి, ఫీవర్, చెస్ట్, యునానీ ఆసుపత్రుల్లో సేవలకు ఏర్పాట్లు
హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ముందస్తు చర్యలు చేపడుతుంది. గత ఏడాది మార్చి 2వ తేదీన మహేంద్రహిల్స్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో మొదటి పాజిటివ్ కేసు బయటపడటంతో అప్పటి నుండి రోగుల కోసం ఐదు ఆసుపత్రులను సిద్దం చేసి పాజిటివ్ వచ్చినవారికి వైద్య సేవలందించారు. ఇప్పటివరకు గ్రేటర్ నగరంలో 1,64,520 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 1054 మరణాలు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 24 కేసులు నమోదైతున్నాయి. పక్క రాష్ట్రాల ప్రభావంతో మళ్లీ వైరస్ పుంజుకుని నగర ప్రజలను సోకితే ఏవిధంగా ఎదుర్కోవాలో వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించి ఇప్పటికి సేవలందిస్తున్నారు.దీనితో పాటు గచ్చిబౌలి టిమ్స్‌లో కూడా ప్రస్తుతం కరోనా రోగులకు ప్రత్యేక విభాగం కేటాయించి చికిత్సలు అందిస్తున్నారు.
గత నాలుగు నెల నుంచి కేసుల సంఖ్య తగ్గడంతో పడకలతో పాటు, వైద్య సిబ్బందిని పరిమిత సంఖ్యలో ఉంచారు. గత వారం రోజుల నుంచి పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, చత్తీష్‌ఘడ్‌ల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్కడ ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించే పరిస్దితికి వచ్చాయి. ఈమూడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువగా హైదరాబాద్‌నగరానికి రాకపోకలు సాగిస్తారు.దీంతో గ్రేటర్ నగరంలో కూడా వైరస్ మళ్లీ రెక్కలు కట్టుకునే అవకాశం ఉందని వైద్యాధికారులు మొన్నటివరకు కరోనా రోగులకు సేవలందించిన ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి, చార్మినార్ యునానీ, నల్లకుంట ఫీవర్‌ఆసుపత్రులను వైద్య సిబ్బంది సిద్దం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, పడకలు, అక్సిజన్ సిలిండర్లు, తగిన మందులతో పాటు మాస్కులు, బ్లౌజులు, శానిటైజర్ అందుబాటులో ఉంచేలా ఉన్నతాధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రోగులు వస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.
అదే విధంగా నవంబర్ వరకు 196 బస్తీదవాఖానలతోపాటు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్దానిక ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు చేసి తక్కువ లక్షణాలుంటే వారిని హోం ఐసోలేషన్, ఎక్కువ లక్షణాలు కనిపిస్తే గాంధీ, టిమ్స్ ఆసుపత్రులకు తరలించేవారు. రేపటి నుంచి కరోనా పరీక్షలు చేసేందుకు ఆరోగ్య కేంద్రాలకు కిట్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. నగర ప్రజలు దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా సమీపంలో ఉన్న హెల్త్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈసారి కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా ఇష్టాసారంగా రోడ్లపై గుంపులుగా తిరగకుండా ముఖానికి మాస్కులు, శానిటైజర్ వినియోగించాలని, టీకాతో కట్టడి సులభంకాదని, నగరవాసులు వైద్యుల సలహాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.