మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ పిజిఇసెట్ 2022 పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకు రోజు రెండు విడతల్లో పిజిఇసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి.లక్ష్మినారాయణ తెలిపారు. ఈ మేరకు పిజిఇసెట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండవ సెషన్ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు హైదరాబాద్‌లో 5, వరంగల్‌లో 7, మొత్తం 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరీక్షకు 14,933 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టం చేశారు.