Wednesday, January 22, 2025

రోల్ మోడల్‌గా టిఎస్ ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థల చరిత్రలోనే టిఎస్ ఆర్టీసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్, హెల్పర్లు, డ్రైవర్, -కండక్టర్ల నుంచి సూపర్ వైజర్స్, అధికారుల వరకు అన్ని విభాగాలను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అవార్డులను ప్రదానం చేసింది. రోల్ ఆఫ్ హానర్, ఎక్స్‌ట్రామైల్, ఇన్నోవేషన్, బెస్ట్ ఎంప్లాయ్, ఉత్తమ డిపో, ఉత్తమ రీజియన్ వంటి వివిధ కేటగిరీల కింద దాదాపు 500 మందికి పైగా అవార్డులను ఆర్టీసి అందజేసింది.
అవార్డుల ప్రక్రియ నిరంతరం
మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని కళా మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, సంస్థ విసి అండ్ ఎండి విసి సజ్జనార్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులను కలిసి పురస్కార గ్రహీతలకు మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రాలను అందజేసి వారి సేవలను కొనియాడారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్‌లతో పాటు సూపర్‌వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ, రీజనల్ మేనేజర్స్ అన్ని విభాగాల వారు పురస్కారాలను అందుకున్నారు. అన్ని కోణాల్లో ఉత్తమ ఉద్యోగులను గుర్తించడంతో పాటు, అధికారులు, ఉద్యోగుల కృషిని అభినందించేందుకు నగదు పురస్కారాలతో పాటు అవార్డులను బహుకరించారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, డిపో స్థాయిలో నెలవారీగా, ప్రాంతీయ స్థాయిలో త్రైమాసికం, జోనల్ స్థాయిలో ఆరునెలలకొకసారి, కార్పొరేట్ స్థాయిలో ఏడాదికొకసారి నిర్వహించనున్నట్టు వారు స్పష్టం చేశారు.
రోల్ ఆఫ్ హానర్ కింద 24 మంది
ఉత్తమ పనితీరును కనబరిచిన ఉద్యోగులు, అధికారులకు రోల్ ఆఫ్ హానర్ కింద 24 మంది (డ్రైవర్లు- 2, కండక్టర్లు-3, మెకానిక్, హెల్పర్లు, శ్రామిక్‌లు-2, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు- 4, మెకానికల్ సూపర్‌వైజర్లు- 3, డిపో మేనేజర్లు- 3, డిప్యూటీ ఆర్‌ఎం- 1, రీజనల్ మేనేజర్-1) పురస్కారాలు అందుకున్నారు. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన వారిని ఆర్టీసి యాజమాన్యం సత్కరించి అభినందించింది.
రోల్ ఆఫ్ హానర్ అవార్డు గ్రహీతలు
డ్రైవర్లు -జి.సైదులు, ఎం.హనుమయ్య, జి.శ్రీశైలం, సిహెచ్.లక్ష్మయ్య, కండక్టర్లు – సి.హెచ్.నర్సయ్య, పి.సత్తయ్య, కె.నర్సింహా, కె.కవిత, మెకానిక్స్ – జి.రాజేందర్, ఎండి బద్రుద్ధీన్, టైర్ మెకానిక్- ఎంఎ రవూఫ్, శ్రామిక్- శివ లింగం, అసిస్టెంట్ మేనేజర్స్ (టి)- బి.అశ్విని, ఆర్.సరితాదేవి, ఎన్.వెం కన్న, ఎం.హుస్సేన్, ఎఈ (ఎం) – ఆర్.హనుమాన్, ఇ.అమల, సూపరింటెండెంట్ – జె.జి.చార్యులు, డిపో మేనేజర్స్ – ఎన్.ఇషాఖ్, బి.పాల్, బి.శ్రీని వాస రావు, డిప్యూటీ ఆర్.ఎం (ఒ) జి.అపర్ణ కల్యాణి, రీజనల్ మేనేజర్ – సి.హెచ్.వెంకన్నలు రోల్ ఆఫ్ హానర్ అవార్డు పురస్కారాలను అందుకున్నారు.
ఉత్తమ డిపోలు, రీజియన్‌లకు నగదు పురస్కారం
ఉత్తమ డిపో కేటగిరీలో మహబూబ్‌నగర్ (ప్రథమ- రూ.3లక్షలు), సత్తుపల్లి (ద్వితీయ రూ.2.50 లక్షలు), ఇబ్రహీంపట్నం (తృతీయ-రూ.2లక్షలు) రివార్డులను ఆయా డిపోలు అందుకున్నాయి. అలాగే, దసరా, సంక్రాంతి స్పెషల్ ఛాలెంజ్‌లో ఉత్తమ రీజియన్లుగా ప్రథమ స్థానంలో హైదరాబాద్, సికింద్రాబాద్ (లక్ష చొప్పున), ద్వితీయ స్థానంలో అదిలాబాద్, కరీంనగర్ (రూ.75 వేల చొప్పున), తృతీయ స్థానంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ (రూ.50వేల చొప్పున) అవార్డులు-, రివార్డులను కైవసం చేసుకున్నాయి.
దూర ప్రాంతాల సర్వీసులకు ఆదరణ: ఆర్టీసి చైర్మన్
టిఎస్ ఆర్టీసి ప్రైవేట్ వాహన రంగాన్ని తట్టుకొని ముందుకెళుతుందని, దూర ప్రాంతాల సర్వీసులకు ఆదరణ బాగా లభిస్తోందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే సిబ్బంది సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. రూ.37 కోట్లతో నిర్మల్ బస్‌స్టేషన్, రూ.80 కోట్లతో వరంగల్ బస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 45 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న టిఎస్ ఆర్టీసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని, సంస్థ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ లాభాల దిశలో పయనించేందుకు తగిన ప్రయత్నం చేస్తోందన్నారు. సిబ్బంది ఆరోగ్య సంక్షేమానికై తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపా యాలు కల్పించామని, కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండటం సంతోషించదగ్గ పరిణామని ఆయన తెలిపారు.
సమష్టి కృషితోనే సంస్థకు మంచి పేరు: సజ్జనార్
సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సంస్థకు మంచి పేరు వస్తోందన్నారు. గడ్డుకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే స్థాయికి ఎదగడం సంస్థలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బంది, ఉద్యోగులు, అధికారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అవార్డులను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్‌లోనూ మరింత మెరుగైన సేవలు అందించి సంస్థ అభ్యున్నతికి దోహదపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News