Wednesday, January 22, 2025

హైదరాబాద్ దర్శన్ పేరుతో టిఎస్ ఆర్టీసి సేవలు

- Advertisement -
- Advertisement -

TS RTC services in the name of Hyderabad Darshan

శని, ఆదివారాల్లో పర్యాటకుల కోసం…
ప్యాకేజీ టూర్ ప్రారంభోత్సవం సందర్భంగా 10 శాతం రాయితీ
లాంఛనంగా ప్రారంభించిన సంస్థ చైర్మన్, ఎండిలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నగర అందాలను తిలకించేందుకు విచ్చేసే పర్యాటకులకు కోసం టిఎస్ ఆర్టీసి ప్రత్యేకంగా ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని పర్యాటక ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా సంస్థ షెడ్యూల్‌ను తయారు చేసింది. టిఎస్ ఆర్టీసి ‘హైదరాబాద్ దర్శన్’ పేరిట నగరంలో విహరించే రెండు బస్సులను మంగళవారం చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐపిఎస్‌లు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను కేవలం 12 గంటల్లో సందర్శించవచ్చని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం శని, ఆదివారాల్లో మాత్రమే ఈ సేవలు కొనసాగుతాయని, ఆదరణ మేరకు రానున్న రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని వారు తెలిపారు.

ప్రయాణికులు మరింత చేరువయ్యేందుకు సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశలో హైదరాబాద్ దర్శన్ వీకెండ్ టూర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. ఒక్క రోజులో పిల్లలతో హైదరాబాద్‌ను చూడాలనుకునే వారికి ఈ ప్యాకేజీ టూర్ సేవలు బాగా ఉపయోగపడుతాయని వారు తెలిపారు. ఇందులో మెట్రో ఎక్స్‌ప్రెస్ అయితే పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ 130ల చార్జీ ఉంటుందని, ఎసి మెట్రో లగ్జరీ అయితే పెద్దలకు రూ. 450, పిల్లలకు రూ. 340ల చార్జీగా నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ ప్యాకేజీ టూర్ కోసం www.tsrtconline.in లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని, మరింత సమాచారం కోసం 040 23450033 లేదా 040 69440000 సంప్రదించవచ్చని వారు పేర్కొన్నారు.

ప్యాకేజీ టూర్ వివరాలు ఇలా…

ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ సమీపంలోని ఆల్ఫా హోటల్ బస్టాప్ వద్ద హైదరాబాద్ దర్శన్ బస్సు బయలుదేరి 9గంటలకు బిర్లా మందిర్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ దర్శనం అనంతరం బయలుదేరి 10.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ చేరుకుంటుంది. రెండు గంటల పాటు ప్యాలెస్ చూడటానికి అవకాశం ఇస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భోజనం కోసం మధ్యాహ్నం 1.00 గంటకు తారామతి బారాదరి హరిత రిసార్ట్ వద్ద ఆగుతుంది. ఆ తర్వాత 2.00 గంటలకు గోల్కొండ కోట వద్దకు చేరుకుంటుంది. గంటన్నర పాటు అక్కడ గడిపిన తర్వాత బస్సు సాయంత్రం 4.00 గంటలకు దుర్గం చెరువు పార్క్ వద్దకు వస్తుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.00 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపై తిప్పుతారు. సాయంత్రం 6.30 గంటలకు ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్‌సాగర్ ప్రదేశాల సందర్శన అనంతరం చివరకు రాత్రి 8.00 గంటలకు సికింద్రాబాద్ (ఆల్ఫా హోటల్ బస్టాప్)కు చేరుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News