Monday, December 23, 2024

ప్రయాణికులకు టిఎస్ ఆర్‌టిసి ప్రత్యేక ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్ ఆఫర్లను టిఎస్ ఆర్‌టిసి ప్రకటించింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టి – 24 టిక్కట్లను ఇప్పటికే అందజేస్తున్న ఆర్‌టిసి.. తాజాగా టి – 6, ఫ్యామిలీ – 24 పేర్లతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్లో గురువారం టి – 6, ఫ్యామిలీ – 24 టికెట్ల పోస్టర్లను టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ గురువారం ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుండి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం టి – 6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రూ. 50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటి ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 2.00 గం.ల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్లు ఇస్తారు. మధ్యాహ్నం 2.00 గం.ల తర్వాత టి – 6 టికెట్లును మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టి- 6 టికెట్ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయస్సు ద్రువీకరణ కోసం వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారాంతాలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ – 24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ. 300 చెల్లిస్తే..నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ – 24 టికెట్ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సుల్లో టి – 24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్ ధర పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 60గా ఉంది. కాగా టిఎస్ ఆర్‌టిసి ప్రవేశ పెట్టిన ఈ టికెట్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ కోరారు. టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టిఎస్ ఆర్‌టిసి కాల్ సెంటర్ నంబర్లు 040- 69440000 లేదా 040- 23450033లో సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News