జిల్లాలో టిఎస్ ఆర్టీసి కార్గో, పార్శిల్ సేవల విస్తరింపు
పికప్, హోం డెలివరీ సేవలను ప్రారంభించేందుకు అధికారుల ప్రతిపాదనలు
ఈ సేవల్లో భాగస్వాములు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు
మనతెలంగాణ/హైదరాబాద్: కార్గో, పార్శిల్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు టిఎస్ ఆర్టీసి కసరత్తు మొదలెట్టింది. ‘వేగంగా, భద్రంగా, చేరువగా’ అన్న లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే ఆదరణ చూరగొంది. 177 బస్ ఓసన్లతో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా కొనసాగిస్తున్న పార్శిల్ సేవలు బుకింగ్/ డెలివరీ పాయింట్ల నుంచే కాకుండా నేరుగా వినియోగదారులు ఇంటి వద్దకే ఈ సేవలను అందించేలా ప్రతిపాదనలను రూపొందించింది. అందులో భాగంగా మొదటి, చివరిమైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడానికి భాగస్వాములను ఆహ్వానిస్తోంది. 11 రీజయన్లు, 97 బస్ డిపోలతో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న టిఎస్ ఆర్టీసి, వినియోగదారుల చెంతకే హోం డెలివరీ, హోం పికప్ సదుపాయాల్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రజా రవాణా సేవల్లో భాగంగా నడుపుతున్న బస్సుల ద్వారా పార్శిల్స్ పాయింట్ నుంచి పాయింట్ వరకు సరుకును చేరవేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు…
ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు కొన్ని రీజయన్లలో మాత్రమే హోం డెలివరీ సేవలు కొనసాగుతున్నాయి. అయితే, వినియోగదారులకు మరింత సౌకర్యవంతం కోసం హోం పికప్‌తో పాటు అన్ని జిల్లాలోనూ హోం డెలివరీ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురావడమే లక్షంగా ఆర్టీసి ముందుకెళుతోంది. ఈ సేవలను అందించేందుకు భాగస్వాములయ్యే వారి నుంచి దరఖాస్తులను ఆర్టీసి ఆహ్వానిస్తోంది. టిఎస్ ఆర్టీసితో చేతులు కలుపడానికి ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ముందుకు రావొచ్చని ఆర్టీసి సూచిస్తోంది. ఆర్ధిక సామర్థ్యాలతో పాటు వారి బిజినెస్ వివరాలను splofficertsrtc@gmail.com మెయిల్ కు పంపవచ్చని ఆర్టీసి పేర్కొంది. మరింత సమాచారం కోసం, కార్గో అండ్ పార్శిల్ విభాగం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (నెం.9154197752), 3వ అంతస్తు, బస్ భవన్, హైదరాబాద్‌లో ఈ నెల 27వ తేదీ లోపు సంప్రదించవచ్చని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్, ఐపిఎస్‌లు తెలిపారు.
TS RTC to expand Cargo Services in Districts