Monday, December 23, 2024

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

TS SSC exams from tomorrow

రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
040 23230942 నెంబర్‌తో
24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షా కేంద్రంలో సిసి కెమెరా ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా హాలులోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. విద్యార్థులకు వీలైనంత సమీపంలో కేంద్రాలు కేటాయించామని, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది పరీక్షలకు 11,401 పాఠశాలల నుంచి మొత్తం 5,34,903 మంది విద్యార్థులు హాజరవుతుండగా, అందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చర్యలు

పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు నాలుగు స్పెషల్ స్కాడ్‌లు, 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించినట్లు చెప్పారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా సమయంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థుల విషయంలో తెలంగాణ పబ్లిక్ పరీక్షల చట్టం యాక్ట్ 25/1997 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఎఎన్‌ఎంను, ఒక ఆశా వర్కర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లతో సిద్దంగా ఉంచామని అన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కోరారు. అలాగే విద్యార్థులు ఇబ్బంది పడకుండా బస్సులు నడపాలని ఆర్‌టిసిని కోరారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా తగిన చర్కలు తీసుకుంటున్నామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరికొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆరు పేపర్లకే పరీక్షల నిర్వహణ

కొవిడ్ పరిస్థితుల దృష్టా పదవ తరగతి సిలబస్‌లో 70 శాతానికే పరీక్షలు నిర్వహించడంతోపాటు, గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లకు కుదించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ఎక్కువగా ఇచ్చినట్లు చెప్పారు. ఈసారి వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష … ఒక ప్రశ్నపత్రం మాత్రమే ఉంటుందన్నారు. ఈ నెల 27వ తేదీన జరుగనున్న సైన్స్ సబ్జెక్టుకు మాత్రం అయితే రెండు వేర్వేరు ప్రశ్నాపత్రాలు, జవాబుపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక జవాబుపత్రంలో భౌతికశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలను, మరో జవాబుపత్రంలో జీవశాస్త్రం జవాబులను రాయాల్సి ఉంటుందని వివరించారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఛీఫ్ సూపరింటెండెంట్ సహా డిపార్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని అన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాలకు చుట్టు పక్కల జిరాక్స్ కేంద్ర కేంద్రాలు మూసివేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

కంట్రోల్ రూమ్

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో 040 23230942 నెంబర్‌తో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చని డైరెక్టర్ కృష్ణారావు అన్నారు. ఈ ఫోన్ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు

ప్రతి పరీక్షా కేంద్రంలోని ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైనచోట అదనంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

శానిటైజర్, వాటర్ బాటిళ్లకు అనుమతి

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజర్,వాటర్ బాటిళ్లకు అనుమతిస్తామని అన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు ధరించవచ్చు.
విద్యార్థులకు సూచనలు

సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు.

కొవిడ్ పరిస్థితుల దృష్టా పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం పాటించాలి,

సివిల్ డ్రెస్‌లోనే పరీక్షకు హాజరు కావాలి, యూనిఫాంలో వెళితే పరీక్షకు అనుమతించరు.

రైటింగ్‌ప్యాడ్, అవసరమైన పెన్నులు, పెన్సిల్ తీసుకెళ్లాలి.

విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి

ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ రాయాలి.

అదనపు సమాధాన పత్రాలు, గ్రాఫ్, బిట్ పేపర్లు విడిపోకుండా సమాధాన పత్రంతో గట్టిగా ధారంతో కట్టాలి.

డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.

పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటల కంట్రోల్ రూం నెంబర్ 040- 23230942కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎటువంటి భయాందోళనలకు, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. టెన్త్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేలా వారి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని వినియోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులందరూ పరీక్షలో విజయం సాధించి వారి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News