జనవరి 2 నుంచి 20వరకు పరీక్షలు రోజుకు
రెండు సెషన్లలో కొనసాగనున్న ఎగ్జామ్స్
15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
ఫిబ్రవరి 5న టెట్ తుది ఫలితాలు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ హాల్‌టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) నిర్వహిస్తారు. పరీక్షలను పేపర్-1, పేపర్-2 రూపంలో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్ -1 పరీక్ష, జనవరి 2,5,11,12,19,20 తేదీల్లో పేపర్- 2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను 15 నిముషాల ముందే మూసివేయనున్న దృష్టా అభ్యర్ధులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సిందే.
అర్హత సాధించకపోతే మరి నియామకం లేనట్లే. వారే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌రాయడానికి అర్హులు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెట్ -1 పరీక్షను నిర్వహించి అందులో అర్హత పొందిన అభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించి నియామకాలను చేపట్టింది. ఇప్పుడు మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవడంతో టెట్- 2 ను నిర్వహిస్తోంది. సరైన ప్రణాళికా ప్రకారం చదివితే టెట్‌లో మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధిస్తే డీఎస్సీ పరీక్షలో మెరిట్ లభిస్తోంది. దీంతో అందరి కంటే ముందు వరుసలో జాబ్ కోసం మీరు ఉంటారని చెబుతున్నారు. సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఇంకా మంచిదని అంటున్నారు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ ఇలా : టిజి టెట్ వెబ్ సైట్ లోకి ఎంటర్ కాగానే హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల జనవరి 11న ఉదయం సెషన్ లో జరిగే పరీక్షలు, అలాగే 20వ తేదీ ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంచడం లేదని ప్రభుత్వం తెలిపింది. వీటిని రేపటి నుంచి అందుబాటులో ఉంచుతారు.
ఉపాధ్యాయుల అర్హతకు పరీక్ష : ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టే అర్హత టెస్ట్. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ముందుగా టెట్ లో అర్హత సాధించాలి. ఆ తర్వాత డిఎస్సి (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) ద్వారా స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది రేవంత్ సర్కార్. ఈ పరీక్షలో జాబ్స్ సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి ఉద్యోగాల్లో కూడా చేర్చుకున్నారు. అయితే ఈ రిక్రూట్ మెంట్ సమయంలోనే మరోసారి భారీగా టీచర్ రిక్రూట్ మెంట్స్ చేపడతామని ప్రకటించారు. అన్నట్లుగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది . ఇందులో భాగంగానే మరోసారి టెట్ నిర్వహణకు సిద్దమైంది. 2025 జనవరి 2 నుంచి జరగనున్న టెట్ పరీక్ష కోసం శుక్రవారం నుండి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలు వెల్లడి : ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా, పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 11. 30 గంటలకు పరీక్ష ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 4.30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 7075028882 / 85 నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.