తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఈ నెల 20 వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిమిలినరీ కీ, రెస్పాన్స్ షీట్లను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. పేపర్ల వారీగా ప్రాథమిక కీ ని అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్ ప్రాథమిక కీ లపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ తుది కీ ఖరారు చేయనున్నారు.
టెట్ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది(74.44 శాతం) హాజరయ్యారు. టెట్ పేపర్ 1కు 94,327 మంది దరఖాస్తు చేసుకోగా, 69,476 మంది(73.65 శాతం) హాజరు కాగా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 93,263 మంది దరఖాస్తు చేసుకోగా, 69,390 మంది(74.40 శాతం), పేపర్ 2 సోషల్ స్టడీస్‌కు 88,163 మంది దరఖాస్తు చేసుకోగా, 66,412 మంది(75.33 శాతం) హాజరయ్యారు.