మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన బకాయిల వివాదంపై తెలంగాణ జెన్ కో సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. ఎపి జెన్ కో, ఎపి జెన్ కో పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల నుంచి రూ.4,774 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొంది. బకాయిలు చెల్లించేలా ఎపిని ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును టిఎస్ జెన్ కో, పావిడెంట్ ఫండ్, పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్టు కోరాయి. ఈ పిటిషన్‌పై విచారణ తేలేవరకూ కఠినమైన చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును తెలంగాణ జెన్‌కో పిటిషన్‌లో కోరింది. ఈక్రమంలో రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలను ఎపి జెన్ కో ఉల్లంఘించిందని తెలంగాణ జెన్ కో తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తెలంగాణ నుంచి రూ.6,283 కోట్ల బకాయిలు రావాల్సి ఉందంటూ తెలంగాణ హైకోర్టులో ఎపి జెన్ కో గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. విభజన సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటైనందున వివాదాలు అక్కడే తేల్చుకుంటామని వెనక్కి తీసుకుంది. పరిష్కారం కాకపోతే మళ్లీ పిటిషన్ వేస్తామని ఎపి జెన్‌కో కోర్టుకు తెలిపింది. అయితే ఎపి పిటిషన్లు వేస్తూ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోందన్న టిఎస్ జెన్‌కో ఆరోపిస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్న కారణంతో బకాయిలు సర్దుబాటు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా 3,443 ఉద్యోగుల్లో కేవలం 28 మంది కేటాయింపు మాత్రమే పెండింగులో ఉందని దానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీల ధర్మాసనం కేంద్రం, ఎపి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎపి జెన్ కో, ఎపి జెన్ కో పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్టు, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ పిటిష్ప విచారణ వాయిదా వేసింది.
TSGENCO Appeal to High Court over AP Power Arrears