మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి విదితమే. అయితే ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో 84.06 శాతం మంది అర్హత సాధించినట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి మంగళవారం (మే 30) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్‌లో మంగళవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఎస్‌సిటి పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 98,218 (90.90శాతం), ఎస్‌సిటి ఎస్‌ఐ సివిల్ పోస్టులకు 43,708 (75.56 శాతం), ఎస్‌సిటి పోలీసు కానిస్టేబుల్ ఐటి అండ్ సిఒ ఉద్యోగాలకు 4,564 (74.84 శాతం), ఎస్‌సిటి ఎస్‌ఐ ఐటి అండ్ సిఒ పోస్టులకు 729 (23.40 శాతం), ఎస్‌సిటి పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779 (89.53 శాతం), ఎస్‌సిటి ఎఎస్‌ఐ ఎఫ్‌పిబి ఉద్యో గాలకు 1,153 (77.54 శాతం), ఎస్‌సిటి ఎస్‌ఐ పిటిఒ ఉద్యోగాలకు 463 (79.97 శాతం), ఎస్‌సిటి పిసి మెకానిక్ పోస్టులకు 238 (82.07 శాతం) మంది అర్హత సాధించారు.
వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష రెస్పాన్స్ (ఓఎంఆర్) షీట్లను మే 30న రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థుల స్కానింగ్ ఓఎంఆర్ షీట్లతోపాటు, పరీక్షల ఫైనల్ కీలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: support@tslprb.in లేదా 93937 11110/ 93910 05006 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం
అభ్యర్థుల మార్కులు మే 30 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టిఎస్‌ఎల్ పిఆర్‌బి వెల్లడించింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ.2,000, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ.3,000 చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1న ఉదయం 8 గంటల నుంచి జూన్ 3న రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తుల సవరణకు అవకాశం
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకునేందుకు పోలీసు నియామక మండలి అవకాశం కల్పించింది. అభ్యర్థుల తుది మెరిట్ జాబితా వెల్లడి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వివరాలను సవరించుకునే వెసులుబాటు కల్పించింది. అభ్య ర్థులు తమ కమ్యూనిటటీ, వయసు, స్థానికత్వం, ఎక్స్-సర్వీస్‌మెన్ స్టేటస్, అకడమిక్ క్వాలిఫికేషన్ తదితర వివరాలను సవరించుకోవచ్చు.
కాగా, తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఏప్రిల్ 30న జరిగింది. తుది పరీక్షల్లో లక్షా 9 వేల 663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గానూ లక్షా 8 వేల 55 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐటి అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6 వేల 801 మందికి గానూ 6 వేల 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటి అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
Also Read: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచండి