Monday, January 20, 2025

గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు..

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 29,30 తేదీలలో గ్రూప్ 2
పరీక్ష తేదీలను ఖరారు చేసిన టిఎస్‌పిఎస్‌సి
783 పోస్టులు… 5,51,943 దరఖాస్తులు
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షల తేదీలను టిఎస్‌పిఎస్‌సి ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్- 1 మెయిన్స్, గ్రూప్ -4 పరీక్ష తేదీలను టిఎస్‌పిఎష్‌సి ఇప్పటికే ఖరారు చేసింది. జూన్ 5 నుంచి గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు, జులై 1న గ్రూప్- 4 పరీక్షలు జరగనున్నాయి.

ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ
రాష్ట్రంలో 783 గ్రూప్- 2 ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రూప్ -2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ -1 తర్వాత గ్రూప్ -2 ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. నాయబ్ తహసీల్దార్, ఎసిటిఇ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎస్‌ఐ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల పంచాయతీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు గ్రూప్- 2 ద్వారా భర్తీ చేస్తారు.

గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1,032 పోస్టులను భర్తీ చేశారు. అదేవిధంగా గత నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూ ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇంటర్వూలు రద్దు చేసిన నేపథ్యంలో కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందనున్నారు. దీంతో గ్రూప్ 2కు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2కు ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో ప్రశ్నలు అన్ని మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే టిఎస్‌పిఎస్‌సి పరీక్షా తేదీలను నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News