Saturday, December 21, 2024

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు టిఎస్‌పిఎస్‌సి..

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లిన టిఎస్‌పిఎస్‌సి…
అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరిన కమిషన్
మంగళవారం విచారణకు జరిపేందుకు అంగీకరించిన డివిజన్ బెంచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరింది. ఈ అప్పీల్‌పై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ ఈ నెల 23వ తేదీన ఉన్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్ధులు భయపడుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై టిఎస్‌పిఎస్‌సి డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్-1 ప్రకటన వచ్చింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం.. శాసనసభలో గతేడాది మార్చిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన అనంతరం 2022 ఏప్రిల్ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటనను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తొలిసారితో పోలిస్తే రెండోసారికి ఏకంగా 52 వేల మంది పరీక్ష రాయలేదు.అభ్యర్థులు మానసికంగా కుంగిపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే చాలా మంది మళ్లీ పరీక్ష రాయలేదు. ఒకసారి ఎంతో కష్టపడి పరీక్ష రాసి పేపర్ లీకేజీ కావడం.. ఆ తర్వాత పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు మానసికంగా కుంగిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు కావడంతో అభ్యర్థులు మానసికంగా మరింత కుంగిపోయే అవకాశముందని కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై టిఎస్‌పిఎస్‌సి డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News