గ్రూప్ -2, 3 ఉద్యోగాలకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
వివిధ విభాగాలకు టిఎస్‌పిఎస్‌సి కమిషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి సూచన
నోటిఫికేషన్లపై వివిధ విభాగాల అధికారులతో కమిషన్ సన్నాహక సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చేందుకు సంబంధిత విభాగాల అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సూచించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం వివరాలన్నీ సకాలంలో అందించాలని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 663 గ్రూప్-2, 1,373 గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్థిక, సాధారణ పరిపాలన, కార్మిక, న్యాయ, అసెంబ్లీ, పురపాలక, పంచాయతీ, రెవెన్యూ అధికారులతోపాటు గ్రూప్-3 పోస్టుల్లో కీలకమైన 50 విభాగాల అధికారులతో కమిషన్ ఛైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి వివిధ విభాగాలకు చెందిన 100 మంది అధికారులు హాజరయ్యారు. ప్రతిపాదనల ఫార్మాట్ గురించి ఛైర్మన్, కార్యదర్శి ఆయా విభాగాలకు చెందిన అధికారులకు వివరించారు. సర్వీస్ రూల్స్, సవరణలు, క్లారిఫికేషన్లు, రోస్టర్ విధానం, ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు, తదితర విషయాలన్నీ టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్దన్‌రెడ్డి వారికి వివరించారు. ఆ తర్వాత వివిధ విభాగాల అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. వీలైనంత త్వరగా ఆయా శాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు టిఎస్‌పిఎస్‌సికి సమర్పించాలని కమిషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి కోరారు.
TSPSC Chairman hold meeting over Group 2 Notification